Africa is splitting into two Continents to create a new ocean
mictv telugu

మారబోతున్న ప్రపంచ పటం, రెండుగా చీలనున్న ఆఫ్రికా

March 14, 2023

Africa is splitting into two  Continents to create a new ocean

ఖండాలెన్ని? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా….ఎనిమిది. అదేంటీ ఖండాలు ఏడు కదా, ఒకటి ఎక్స్ట్రా చెబుతున్నాము అని వింతగా చూస్తున్నారా. అంతలా ఆశ్చర్యపోకండి, ఫ్యూచర్ లో మేమే కాదు మీరు కూడా ఇలానే చెబుతారు. ఎందుకంటే ప్రపంచపటంలోకి ఓ కొత్త ఖండం వచ్చి చేరుతోంది మరి. దీంతో పాటు కొత్త సముద్రం కూడా వస్తోంది. ఒక ఖండంగా చీలి రెండు ఖండాలుగా ఏర్పడతాయిట. దీనికి సంబంధించిన సంకేతాలు భూమి లోపలా, బయటా కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఇదేమీ అంత తొందరగా మనకు తెలిసేలా మాత్రం జరగదుట. భూమి మీద ఈ మార్పులు జరగడానికి కొన్ని వేల ఏళ్ళు పడుతుందని చెబుతున్నారు.

కొత్త సముద్రం:

మొదట నుంచీ భూమి ఎప్పుడూ ఒకేలా లేదు. మారుతూనే ఉంది నిరంతరంగా. అయితే దాన్ని మనం గుర్తించడానికి మాత్రం వందలు, వేళ్ళు పడుతోంది అంతే. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. భూమి లోపల మార్పులు జరగడం మొదలయింది. దానికి సంబంధించిన సంకేతాలు కూడా వస్తున్నాయి. అదే కొత్త ఖండం ఏర్పడ్డానికి కారణం అవుతున్నాయి. ఇప్పుడున్న ఆఫ్రికా ఖండం రెండుగా చీలుతుందిట. భూమి ఆఫ్రికా ఖండంలో మధ్యలో విడిపోతోంది. అలా విడిపోయిన చోట ఒక కొత్త సముద్రం కూడా వస్తుంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీన్ని తూర్పు ఆఫ్రికా చీలిక అంటున్నారు.

చీలుతున్న భూమి:

భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్ అని ఉంటుంది. అది రెండుగా విడిపోవడాన్నే చీలిక అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ టెక్టానిక్ ప్లేట్లు ఎక్కడో భూమి పొరల్లో ఉంటుంది. అది కదలడం ప్రారంభమైంది. అలా కదులుతున్నప్పుడు లోయలాంటి పగుళ్ళు భూమిపైనా, లోపలా కూడా ఏర్పడతాయి. 138 మిలియన్ ఏళ్ళ కిందట సరిగ్గా ఇలా జరగడం వల్లనే దక్షిణ అమెరికా, ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయాయి. ఇప్పుడు ఆఫ్రికాలో మళ్ళీ అదే రిపీట్ అవుతోంది అంటున్నారు సైంటిస్టులు. 2005లోనే ఇథియోపియా ఎడారిలో 56 కి.మీ పొడవున్న భారీ పగులు కనిపించింది. తర్వాత 2018లో కెన్యాలో కూడా ఇలాంటి పగులే కనిపించింది. సముద్రం కింది భాగంలో పలకల కదలిక కారణంగానే ఈ పగుళ్ళు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఆప్రికన్ నిబియన్, ఆఫ్రికన్ సొమాలి, అరేబియన్ అనే పలకల దగ్గర పగుళ్ళనూ గుర్తించారు. ఇవి కొత్త సముద్రానికి సంకేతాలని వారు అంటున్నారు. భూగర్భంలో మొదలైన పగులు ఉపరితలం మీదకు చేరితే కొత్త సముద్రం పుట్టుకకు కారణం అవుతున్నాయని చెబుతున్నారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్రసముద్రంలోని నీరే ఈ పగుళ్ళలోకి ప్రవేశించి కొత్త సాగరంగా మారుతుందని లీడ్స్ యూనివర్శిటీ పరిశోధకుడు క్రిస్టఫర్ మూర్ చెబుతున్నారు.

కొత్త ఖండం:

ప్రస్తుతం ఉన్న సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, కెన్యాలలోని కొంత భూభాగం, ప్రాంతాలు కలిపి కొత్త ఖండంగా ఏర్పడే అవకాశం ఉంది. కానీ మొదటే చెప్పినట్టు ఇప్పటికిప్పుడే ఈ మార్పు మాత్రం జరగదు. ఇదంతా మనకు తెలిసేలా ఏర్పడ్డానికి కొన్ని వేల ఏళ్ళు పడుతుంది. అసలు కొత్త సముద్రం ఏర్పడ్డానికి 5 నుంచి 10 మిలియన్ సంవత్సరాలు పడుతుందిట. అయితే ఈ మార్పుతో ఇప్పుడు సముద్రం లేని ఉగాండా, జాంబియాలకు తీరప్రాంతం వస్తుందిట. ఇప్పడు డ్రైగా ఉన్న ప్రాంతాలు కొన్ని నీళ్ళతో నిండిపోతాయని చెబుతున్నారు.