విడుదల చేయండి.. లేకపోతే చావుకు అనుమతివ్వండి: నళిని - MicTv.in - Telugu News
mictv telugu

విడుదల చేయండి.. లేకపోతే చావుకు అనుమతివ్వండి: నళిని

December 2, 2019

Nalini

దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో 26ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆమె భర్త మురుగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు జైలు అధికారుల సాయంతో నవంబర్ 27న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్‌కు లేఖ కూడా రాశారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తరపు న్యాయవాది పుగజెంది తెలిపారు.

‘విడదల కోసం మేం 26 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాం. ఇప్పుడు ఆ ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. జైలు అధికారులు నా భర్త మురుగన్‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. వారు నా భర్తను పెడుతున్న బాధలు చూడలేకపోతున్నాను. అందుకే మా కారుణ్య మరణానికి అనుమతించండి.’ అని నళిని లేఖలో పేర్కొన్నట్టు లాయర్ పుగజెంది తెలిపారు. తమను వెల్లూరు జైలు నుంచి పుఝల్ జైలుకు తరలించాలంటూ నళిని తమిళనాడు ప్రభుత్వానికి వినతి పత్రం పంపారు. వెల్లూరు జైలు అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. వెల్లూరు జైల్లో మురుగన్ వద్ద మొబైల్ ఫోన్ లభించడంతో అధికారులు ఆయన్ను ఒంటరిగా ఉంచుతున్నారని నిరసనగా గత పది రోజులుగా నళిని, మురుగన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నళినిని ప్రస్తుతం వెల్లూరులోని ప్రత్యేక మహిళా జైల్లో ఉంచారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మొత్తం ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం గవర్నర్ ముందు పెండింగ్‌లో ఉంది.