మేకలు దొంగిలించాడని ఎంపీపై కేసు.. - MicTv.in - Telugu News
mictv telugu

మేకలు దొంగిలించాడని ఎంపీపై కేసు..

September 13, 2019

MP Azam Khan.

వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా పీస్‌గా మారిన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ అజాంఖాన్ మరో చిక్కులో పడ్డారు. ఆయనపై పోలీసులు మేకలు దొంగిలించారని కేసు నమోదు చేశారు. గేదె దొంగిలించారంటూ ఇటీవల కేసు నమోదు చేసిన విషయం మరిచిపోకుముందే ఈ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. యతీంఖాన్ సరాయ్ గేట్ వద్ద నివసించే 50 ఏళ్ల మహిళ నసీమా ఖాతూన్ 2016 అక్టోబర్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2016 అక్టోబర్ 5న అజాంఖాన్‌తో పాటు ఆయన ఏడుగురు అనుచరులు, 25 మంది ఇతరులు తమ ఇంట్లో చొరబడ్డారని నసీమా తన ఫిర్యాదులో పేర్కొంది. 

తన ఇంటిని ధ్వంసం చేసి, బంగారు నగలు, మూడు గేదెలు, ఓ ఆవు, నాలుగు మేకలు దొంగిలించారని ఆమె ఆరోపణలు చేసింది. వక్ఫ్‌బోర్డుకు చెందిన భూమిలో గత 20 ఏళ్లుగా తాను కౌలుదారుగా వున్నానని.. అయితే అజాంఖాన్ అనుచరులు తనను ఈ స్థలం ఖాళీచేసి వెళ్ళిపోవాలని బెదరించారని పేర్కొంది. స్కూల్ కోసం ఆ భూమి వారికి కావాలని తనను నిత్యం వేధించారని తెలిపింది. అయితే పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో వక్ఫ్‌బోర్డు చైర్మన్ వసీం రజ్వీ, సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు చైర్మన్ జాఫర్ అహ్మద్ ఫరూకీ, మాజీ సర్కిల్ అధికారి అలే హసన్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. 

కాగా ఇప్పటికే ఓ విద్యుత్ చౌర్యం కేసులో అజాంఖాన్ సతీమణి, ఎస్పీ ఎంపీ తన్జీన్ ఫాతిమాపై కూడా కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా.. అజాంఖాన్‌పై ఇప్పటివరకు 82 కేసులు నమోదు అయ్యాయి. వాటిలో 50 భూ ఆక్రమణ కేసులు, 28 అలియాగంజ్ రైతుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులు వున్నాయి. స్థానిక కోర్టు ఇప్పటికే అజాంఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేసింది. 2010, 2019 ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందున ఇప్పటికే ఆయనపై రెండు అరెస్టు వారెంట్లు వుండటం గమనార్హం.