ఒక్క ఏడాదిలోనే.. లక్షన్నర ఉద్యోగాలు: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క ఏడాదిలోనే.. లక్షన్నర ఉద్యోగాలు: కేటీఆర్

June 2, 2022

తెలంగాణ వచ్చాక.. 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లకు పెరిగిందని, దేశ వ్యాప్తంగా ఐటీలో 4.5 లక్షల ఉద్యోగాలు వస్తే, ఒక్క హైదరాబాద్‌లో లక్షన్నర ఉద్యోగాలు వచ్చాయని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గడిచిన ఎనిమిదేళ్లలో 4.1 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని బుధవారం ఆయన వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఉన్న టెక్‌ మహీంద్రా కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..”ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో జాతీయ సగటు 17.2 శాతం ఉండగా తెలంగాణ 26.14శాతం వృద్ధి సాధించింది. జాతీయ సగటు కంటే ఏకంగా 9 శాతం అధిక వృద్ధి సాధించింది. ఐటీ సెక్టార్‌లతో తెలంగాణ మరెంతో ప్రగతి సాధించనుంది. హైదరాబాద్‌లో స్టార్టప్‌ కల్చర్‌ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. 2022 జూన్‌ 20న టీ హబ్‌ సెకండ్‌ ఫేజ్‌ను ప్రారంభిస్తాం. టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టులో ప్రారంభించే అవకాశం ఉంది” అని కేటీఆర్‌ అన్నారు.