శవాల మీద చిల్లర ఏరుకునేవాళ్ళు ఎలా వుంటారో చూడలేదు కదూ. వాళ్ళను చూడాలంటే ఉత్తరాంధ్రకు వెళ్ళాల్సిందే. అక్కడ తిత్లీ ప్రభావానికి సర్వం కోల్పోయి కడివెడు బాధల్లో వున్న బాధితులను దోచుకుంటున్నారు కొందరు దొంగలు. వాళ్ళనే మనం శవాల మీద చిల్లర ఏరుకుంటున్నవాళ్ళు అనవచ్చు. తిత్లీ తుఫాన్ సృష్టించి బీభత్సంతో శ్రీకాకుళంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే,కొందరు దళారులు మాత్రం అదే అదునుగా భావించి వాళ్ల పబ్బం గడుపుకుంటున్నారు. తుఫాన్ ధాటికి శ్రీకాకుళంలోని ఉద్దానం, కంచలి, కవిటి, వజ్రకొత్తూరు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, మందాన ప్రాంతాలతో పాటుగా 13 మండలాలు కరెంటు లేక, తాగునీరు లభించక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రధానంగా ఉద్దానంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. మంచినీటి సరఫరాకు కీలకమైన రెండు ప్రాజెక్టులతోపాటు తురకశాసనం రక్షిత మంచినీటి పథకం, మరో 19 సీపీడబ్ల్యూ పథకాలు, 377 పీడబ్ల్యూఎస్ పథకాలు కూడా తుఫాన్ దాటికి దెబ్బతిన్నాయి. వీటిలో 240 పథకాలను పునరుద్ధరించినట్లు చెప్పినా కూడా అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది. ఇదే సమయంలో ప్రజల ఇబ్బందులను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.10 లకు లభించే 20 లీటర్ల మంచినీటి క్యానుకు రూ.100 వరకూ వసూలు చేస్తున్నారు. కొందరు జనరేటర్లు అద్దెకు తెచ్చి ఇళ్లల్లో ట్యాంకులను నింపుతున్నారు. అందుకు ఒక్కసారికి రూ.1000 వసూలు చేస్తున్నారు. వారు అడిగినంత ఇద్దామన్నా జనరేటర్లు కూడా దొరకడం లేదు. కొన్ని చోట్ల ఎన్టీఆర్ సుజలధార నీళ్లు అందుతున్నాయి. కొన్నిచోట్ల స్వచ్ఛంద సంస్థలు ఆపన్నహస్తం అందించినా ఏమాత్రం సరిపోవడం లేదు. కొన్నిచోట్ల జనరేటర్ల సాయంతో మంచినీటి ట్యాంకులను నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాగడానికే నీళ్లు లేక గొంతెండిపోతుంటే చాలామంది స్నానాలే మానేశారు.
ట్యాంకర్ల నుంచి, ఫైర్ ఇంజన్లు నుంచి తాగునీటిని సరఫరా చేసినా కూడా సరిపోవడంలేదు.