చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంది. వరుసగా రెండు సెషన్లలో పడిపోయిన దేశీయ మార్కెట్ ఇవాళ పైకి లేచింది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడవుతుండగా.. కొన్ని స్టాక్స్ ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేశాయి. ఇందులో అదానీ కంపెనీల షేర్లు కూడా ఉన్నాయి. వాటి గురించి ఓసారి చూద్దాం.
అంతర్జాతీయ మార్కెట్ బావుండి బలమైన సంకేతాలు ఇస్తుండడంతో ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఇదే క్రమంలో కొన్ని స్టాక్స్ ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేస్తున్నాయి. ఎస్వీబీ బ్యాంక్ సంక్షోభం కారణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సంకేతాలు వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశలు చిగురించాయి. అమెరికా మార్కెట్లు క్రితం సెషన్‌లో మళ్ళీ భారీగా పెరిగాయి. నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ ఏకంగా 2.14 శాతం మేర పుంజుకుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.06 శాతం మేర పెరిగింది. S&P 500 ఇండెక్స్ 1.65 శాతం లాభపడింది. దీంతో బుధవారం సెషన్‌లో ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి. సౌత్ కొరియా KOSPI, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ సూచీ కూడా లాభాల్లో ఉంది.
ఇక దేశీయ మార్కెట్ల విషయానికి వస్తే ప్రస్తుతం సెన్సెక్స్ 270 పాయింట్లు పెరిగి 58 వేల 170 మార్కు దగ్గర ఉంది. నిఫ్టీ 80 పాయింట్లకు పైగా లాభంతో 17 వేల 130 మార్కు దగ్గర ట్రేడవుతోంది. ఏషియన్ పెయింట్స్, లార్సెన్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాబాల్లో దూసుకెళుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నెస్లే, బ్రిటానియా డీలాపడ్డాయి. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.69 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.87 శాతం పెరిగింది.
డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.14 దగ్గర కొనసాగుతోంది. అలాగే బ్రెంట్ క్రూడాయిల్ అంతర్జాతీయంగా 78.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.