ప్రియమైన వ్యక్తిని కోల్పోయినా ఆ బాధను మర్చిపోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. కలకత్తాలోని ఒక వ్యక్తి తన భార్య సిలికాన్ విగ్రహాన్ని చేయించాడు. దీనికోసం 2.5లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
మనసుకు దగ్గరయిన వారు చనిపోతే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. యేండ్లుగా కలిసి ఉంటున్న భార్య తనకు ఇక లేదని తెలిసి ఆ భర్త బాధపడ్డాడు. పదే పదే గుర్తు వచ్చే ఆమె మోమును కలకాలం తన ముందు ఉంచుకోవాలనుకున్నాడు. కలకత్తాకి చెందిన 65యేండ్ల ఒక వ్యక్తి భార్య కోవిడ్ తో 4 మే 2021లో మరణించింది.
కలకత్తాకి చెందిన తపస్ శాండిల్య తన దివంగత భార్య ఇంద్రాణి మరణించి సంవత్సరం దాటిపోయింది. ఇంకా ఆమె జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోయాడు. అందుకే ఆమె గుర్తుగా సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించాడు. ఈ బొమ్మ బరువు సుమారు 30 కిలోలు. తన కుమారుడి వివాహా రిసెప్షన్ కు ధరించిన పట్టు చీరను ఈ బొమ్మకు కట్టారు. పైగా తనకు ఎంతో ఇష్టమైన సోఫా మీద కూర్చోబెట్టారు.
ఆరునెలల కాలం..
‘ఒక దశాబ్దం క్రితం మాయాపూర్ లోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించాం. అప్పుడు ఆర్డర్ వ్యవస్థాపకుడు, ఏసీ భక్తి వేదాంత స్వామి సజీవ విగ్రహాన్ని చూశాం. అప్పుడు ఇంద్రాణి తాను చనిపోతే అలాంటి విగ్రహం కావాలని కోరింది. అందుకే ఆమె కోరికను తీర్చాను’ అంటున్నాడు తపస్. ప్రధానంగా మ్యూజియంల కోసం సిలికాన్ ప్రతిరూపాలతో పనిచేసే శిల్పి సుబిమల్ దాస్ ఈ బొమ్మను తయారుచేశాడు. అతను ఈ బొమ్మను తయారు చేయడానికి ఆరు నెలలు తీసుకున్నాడు. ఇంద్రాణి రూపును తయారుచేయడానికి తపస్ కొంత సాయం చేశాడు. 39 యేండ్ల తమ సంసార జీవితంలో ఆమెను దగ్గరుండి గమనించాడు. అంతేకాదు.. ఇంద్రాణి టైలర్ కూడా బొమ్మ తయారీలో పాలు పంచుకున్నాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆమెకు బట్టలు కుడుతున్నాడు.
నచ్చకపోయినా..
ఈ విగ్రహం కొందరు కుటుంబ సభ్యులకు నచ్చలేదు. చాలామంది వ్యతిరేకించారు. కానీ కొందరు మాత్రం తపస్ కి అండగా నిలిచారు. చనిపోయాక ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో ఉంచుతారు. అదే విగ్రహం ఎందుకు పెట్టకూడదని తపస్ ప్రశ్నిస్తున్నాడు. నిజమే కదా!