After MP-MLA fail, K'taka villagers build bus shelter, make buffalo chief guest
mictv telugu

బస్ షెల్టర్‌ను ప్రారంభించిన గేదె.. వీడియో వైరల్

July 22, 2022

ఓటేసి గెలుపించుకున్న ప్రజాప్రతినిధుల ప్రధాన కర్తవ్యం ప్రజల సమస్యలను పరిష్కరించడమే. ఒకవేళ వారు బాధ్యతలను విస్మరిస్తే.. తగిన గుణపాఠం చెప్పే అధికారం ప్రజలకూ ఉంటుందని తెలియజేశారు ఆ గ్రామస్థులు. స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు తమ గోడు ఇదని చెప్పిన‌ప్ప‌టికీ ఒక్క‌సారి కూడా స్పందించ‌కపోవడంతో అంతా క‌లిసి ఓ నిర్ణ‌యం తీసుకుని దానిని వినూత్నంగా అమ‌లుప‌రిచి.. ఆ తతంగాన్ని అంతా సోష‌ల్ మీడియాలో పెట్టారు. అది కాస్త నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. అంతే దెబ్బ‌కి ఎమ్మెల్యే నే స్వ‌యంగా క‌దిలి వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.

 

క‌ర్ణాట‌క‌లోని గ‌డ‌గ్ జిల్లా బాలెహుసుర్ గ్రామంలోని బ‌స్ షెల్ట‌ర్ పూర్తిగా శిథిలావ‌స్థ‌కు చేరుకుని ధ్వంసం అయ్యింది. అంతేకాకుండా చుట్టుప‌క్క‌ల వారంతా అక్క‌డ చెత్త వేస్తుండ‌టంతో ఆ ప్రాంత‌మంతా డంపింగ్ యార్డులా త‌యారయ్యింది. దీంతో కాలేజీల‌కు,స్కూళ్ల‌కు వెళ్లే పిల్ల‌ల‌కు బ‌స్ షెల్ట‌ర్ లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వ‌ర్షాకాలంలో అయితే ప్ర‌యాణికుల ప‌రిస్థితి మ‌రి అధ్వానంగా త‌యారయ్యింది. దీంతో బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామప్ప లమాని, ఎంపి శివకుమార్‌ లకు బస్ షెల్టర్ ను పునర్మించమని చాలా సార్లు తాము వినతి పత్రం ఇచ్చామని రైతు నాయకుడు లోకేష్‌ జలవాడగి చెప్పారు. అయినా కూడా వారు స్పందించకపోవడంతో గ్రామ ప్ర‌జ‌లంతా కలసి ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అంద‌రూ క‌లిసి తాత్కాలిక బ‌స్ షెల్ట‌ర్‌ను నిర్మించారు. ఆ షెల్ట‌ర్ ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథిగా గేదెను తీసుకెళ్లారు. అంతేకాకుండా దానితో రిబ్బ‌న్ క‌ట్ చేయించారు. అదంతా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ‌స్ షెల్ట‌ర్ కోసం స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులకు, అధికారుల‌కు ఎన్నిసార్లు విన్న‌వించినా కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అందుకు ఈ విధంగా చేసిన‌ట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే… ఆ విష‌యం త‌న దృష్టికి రాలేద‌ని, అయితే త్వ‌ర‌లోనే ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.