ప్రముఖ పేమెంట్ ప్లాట్ఫాం పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్. మొబైల్ రీఛార్జులపై ఆ కంపెనీ అదనపు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. రీఛార్జి మొత్తాన్ని బట్టి రూ.1 నుంచి రూ.6 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పేటీఎం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోయినప్పటికీ.. కొంతమంది యూజర్ల నుంచి ఈ మొత్తాన్ని ఇప్పటికే వసూలు చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది.
కన్వినెన్స్ ఫీజ్, ప్లాట్ఫామ్ ఫీజ్ పేర్లతో దీన్ని వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే చార్జీల వడ్డెనకు గురైన యూజర్లు కొందరు ఆ స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే మార్చి చివరి నుంచే అతి కొద్ది మందికి అదనపు చార్జీలు పడగా.. ఇప్పుడు చాలా మందికి పేటీఎం అమలులోకి తెచ్చిందని సమాచారం. అయితే ప్రస్తుతానికి రూ.100 ఆపై రీచార్జ్లపైనే పేటీఎం అదనపు చార్జీలను వసూలు చేస్తోందని స్క్రీన్ షాట్లను బట్టి తెలుస్తోంది.