After Sri Lanka economic crisis in ten other countries including Pakistan
mictv telugu

శ్రీలంక తర్వాత పాక్ సహా మరో పది దేశాల్లో ఆర్ధిక సంక్షోభం

July 16, 2022

ఆర్ధిక సంక్షోభంతో మన పక్క దేశమైన శ్రీలంక పరిస్థితి ఏంటో మనం రోజూ వార్తల్లో వింటున్నాం. అక్కడి ప్రజల తిరుగుబాటు, అధ్యక్షుడు పారిపోవడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం వంటివి ఆ దేశ దుస్థితికి తార్కాణాలు. తెచ్చుకున్న రుణాలు తీర్చలేక, ఆదాయం పడిపోయి చివరకు ఆహార సమస్య కూడా తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీలంక లాంటి పరిస్థితులు ఏఏ దేశాల్లో ఉన్నాయో చూచాయగా తెలుసుకుందాం.
1. పాకిస్తాన్ : మరో పొరుగుదేశమైన పాకిస్తాన్ త్వరలో శ్రీలంక స్థాయికి చేరకునేందుకు సిద్ధంగా ఉంది. విదేవీ మారక నిల్వలు 9.8 బిలియన్ డాలర్లకు పడిపోగా, ఐదు వారాల వరకే ఈ డబ్బు పనికొస్తుంది. తర్వాత దిగుమతులకు ఐఎంఎఫ్ రుణం ఇవ్వకపోతే మరో విఫలదేశంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి, రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 40 శాతం వడ్డీలకే సరిపోతుంది.
2. ఉక్రెయిన్ : రష్యాతో జరుగుతున్న యుద్దంలో వనరులు అయిపోయినా ఈ దేశం ఇంకా మొండిగా పోరాడుతోంది. పాశ్చాత్య దేశాల సహకారంతో ఈ మాత్రం యుద్ధం నెట్టుకొస్తున్నా ఆర్ధికంగా మాత్రం ఎలాంటి ఎదుగుదల లేదు. ఈ సెప్టెంబర్ నాటికి 1.2 బిలియన్ డాలర్ల అప్పు చెల్లించాల్సి ఉండగా, తర్వాత సుమారు 20 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని కట్టక తప్పదు. ఒకవేళ వాటిని రీషెడ్యూల్ చేసుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. పాలకులు తమ మొండి వైఖరితో దేశాన్ని శిథిలంగా మారుస్తున్నారు. ఆయుధాలపరంగా సాయం చేసే పాశ్చాత్య దేశాలు ఆర్ధికంగా ఏమేరకు ఆదుకుంటాయో వేచి చూడాలి.
3. అర్జెంటీనా : విదేశీ మారక నిల్వలు చాలా తక్కువ ఉన్న దేశాల్లో అర్జెంటీనా ఒకటి. ఇప్పుడున్న మారక నిల్వలతో 2024 వరకు ఎలాగోలా నెట్టుకు రాగలదు. కానీ, తర్వాత పెద్ద మొత్తంలో విదేశీ రుణాలను చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఆ దేశం డిఫాల్ట్ రేటింగులో ఉండగా, కరెన్సీ పెసో 50 శాతం పడిపోయింది.
4. ఘనా : వరుసగా అప్పులు చేసుకుంటూ వెళ్లి, వాటిని తీర్చే శక్తి లేక ఈ ఆఫ్రికా దేశం చతికిలపడింది. దేశ జీడీపీలో అప్పుల శాతం 85కి చేరింది. ద్రవ్యోల్బణం 30 శాతానికి పెరుగగా, దేశీ కరెన్సీ ఆరు నెలల్లోనే 25 శాతం నష్టపోయింది. పన్నుల ద్వారా వస్తున్న ఆదాయంలో సగం రుణాలకే పోతోంది.
5. బెలారస్ : ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి రష్యాకు మద్ధతుగా నిలిచింది ఈ దేశం. పాశ్చాత్య దేశాల ఆర్ధిక ఆంక్షల కారణంగా రష్యానే రుణాలను సకాలంలో చెల్లించలేకపోయింది. ఇక బెలారస్ ఎంత. ఈ దేశంపై కూడా కఠినమైన ఆంక్షలు విధించడంతో రష్యా పరిస్థితే ఈ దేశానికి రానుంది.
ఇక ఇదే బాటలో ఈక్వెడార్, బిట్ కాయిన్‌కు చట్టబద్ద హోదా ఇచ్చిన ఎల్ సాల్వెడార్, కెన్యా, ఈజిప్ట్, ట్యునీషియా వంటి దేశాలు సాగుతున్నాయి. మన పొరుగునున్న భూటాన్ ఈ స్థాయిలో లేదు కానీ, పడిపోయిన ఆదాయాన్ని భర్తీ చేసేందుకు టూరిస్టులపై విధిస్తున్న పన్నును భారీగా పెంచేసింది. కాగా, ఆయా దేశాలు ఇలా పతనం చెందడానికి కారణం అప్పులు చేయడం ఒక్కటే కాదు. కరోనా వల్ల ఆదాయం పడిపోవడం, కేవలం కొన్ని వస్తువుల ఉత్పత్తిపై ఆధారపడడం, పాలకుల నిర్లక్ష్య వైఖరి, రష్యా – ఉక్రెయిన యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.