After Twitter, Meta planning its biggest round of layoffs ever
mictv telugu

ఇప్పుడు మార్క్ వంతు.. వేలాది ఉద్యోగులను తొలగించనున్న మెటా!

November 7, 2022

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక.. నష్టాలు వస్తున్నాయన్న పేరుతో సంస్థలోని సగం మంది ఉద్యోగులను తొలిగించాడు. ఇప్పుడు మరో ప్రముఖ సంస్థ తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకనుంది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాలో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్‌ 9వ తేదీన అంటే మరో రెండ్రోజుల్లో దీనిపై అధికారక ప్రకటన రావొచ్చని ఆంగ్లపత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనంలో పేర్కొంది.

మెటాలో ఉద్యోగుల లే ఆఫ్స్‌ గురించి సీఈఓ మార్క్ జుకర్‌ బర్గ్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. తమ టీమ్స్‌ను పెద్దఎత్తున పునర్‌వ్యవస్థీకరించాలని చూస్తున్నట్లు, తొలిసారి హెడ్‌ కౌంట్‌ను కూడా తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు సెప్టెంబర్‌లోనే వెల్లడించారు. ఇప్పటికే మెటా సబ్సిడరీలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నెమ్మదించాయి. వీటి ఆదాయం కూడా ఇటీవల భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా.. మెటా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023 కల్లా చిన్న కంపెనీగా మారాలని భావిస్తున్నట్లు కూడా గతంలో వివరించారు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్. గత వారం సిలికాన్‌ వ్యాలీలో పలు సంస్థలు భారీగా లేఆఫ్‌లను ప్రకటించాయి. మరోవైపు అమెజాన్‌ సంస్థ కార్పొరేట్‌ ఆఫీస్‌లో కొత్త నియామకాలను నిలిపివేసినట్లు పేర్కొంది.