వందలాది గుడిసెల కూల్చివేత.. బంగ్లాదేశీలవి అని ఎమ్మెల్యే ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

వందలాది గుడిసెల కూల్చివేత.. బంగ్లాదేశీలవి అని ఎమ్మెల్యే ట్వీట్

January 20, 2020

Bangladesh.

‘మేము భారతీయులమే. ఇదిగో మా ఐడీ ప్రూఫులు. మా గుడిసెలు కూల్చి మమ్మల్ని ఎక్కడికి పొమ్మంటున్నారు. మేము ఈ దేశం వదిలి ఎక్కడికీ పోము. మేము బంగ్లాదేశీయులం కాదు. మా వద్ద ఆధార్, ఓటర్ ఐడీ వంటివి ఉన్నాయి’ అని బెంగళూరు కార్పోరేషన్ పరిధిలోని బెల్లందూరు ఏరియాలో నివసిస్తున్నవారు లబోదిబోమంటున్నారు. తమ గుడిసెలను కూల్చవద్దంటూ వారు అధికారుల కాళ్లా వేళ్లా పడ్డారు. డజన్లకు పైగా ఉన్న వారి పూరి గుడిసెలను అధికారులు కూల్చివేశారు. ‘నా నియోజకవర్గం పరిధిలోని బెల్లందూరులోని కరియమ్మ అగ్రహారలో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. పరిశుభ్రత లేకపోవడంతో పర్యావరణం పాడైపోతోంది. వారిలో కొందరు బంగ్లదేశ్‌ వలసదారులు కూడా ఉన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి’ అని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబవల్లి అధికారులకు ట్వీట్ చేశారు. 

ఆ ట్వీట్ చేసిన కొన్ని రోజుల్లోనే అధికారులు గుడిసెల కూల్చివేతకు పాల్పడ్డారు. ఈ కూల్చివేతల్లో బాధితులు తాము ఇండియన్స్‌మేనని అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై  మహదేవపుర స్పెషల్ కమిషనర్ రణదీప్ స్పందిస్తూ.. ‘ఈ కూల్చివేతలపై ఉన్నతాధికారులెవరికీ ముందస్తు సమాచారం లేదు. కూల్చివేతలపై ఏఈఈ పోలీసులకు నోటీసులు ఇచ్చారని మాకు ఈ విషయమే తెలియదు. బృహత్ బెంగళూరు మహానగర పాలికకు గానీ, కమిషనర్‌కు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఏఈఈపై చర్యలు తీసుకుంటాం. పూర్తి నివేదిక సమర్పించమని జాయింట్ కమిషనర్‌ను కోరాం’ అని తెలిపారు. కాగా, కూల్చివేతల సమయంలో పోలీసుల పాత్రపై సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి.