జార్జిరెడ్డి చూశాక రాత్రి నిద్ర పట్టలేదు.. పరుచూరి గోపాలకృష్ణ - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డి చూశాక రాత్రి నిద్ర పట్టలేదు.. పరుచూరి గోపాలకృష్ణ

November 26, 2019

After watching the film George Reddy did not sleep at night

ఎన్నో వివాదాల నడుమ విడుదల అయిన ‘జార్జిరెడ్డి’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా చూసినవాళ్లంతా సినిమా చాలా బాగుందని.. ఎలాంటి వివాదాలు ఈ సినిమాలో లేవని అంటున్నారు. ఈ నెల 22న విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన అన్నీ సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో, జార్జిరెడ్డి విద్యార్థి రాజకీయాల్లో ఏ విధమైన పాత్ర పోషించాడు అనే అనేక విషయాలు ఈ చిత్రంలో చర్చింపబడ్డాయి. 1960-70 దశకాల మధ్య కాలాన్ని సినిమాలో చాలా చక్కగా చూపించారని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ చెబుతున్న మాట. తాజాగా ఈ సినిమా గురించి టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. 

తాను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు జార్జిరెడ్డితో పరిచయం ఏర్పడిందని అన్నారు. ఈ సినిమాను విడుదల రోజునే చూశానని.. ఆ రోజులను దర్శకుడు జీవన్ రెడ్డి కళ్లకి కట్టాడని తెలిపారు. ‘దర్శకుడు ఏదైతే చెప్పాడో అదే ఈ సినిమాలో చూపించాడు. చాలా కల్పిత దృశ్యాలు వున్నాయి. ఆయన చూపించినట్టుగా కొన్ని సంఘటనలు ఉస్మానియా క్యాంపస్‌లో జరిగినవే. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలకు నేను కూడా సాక్షినే. జార్జిరెడ్డి హత్య జరిగినప్పుడు నేను తిరుపతిలో వున్నాను. తను నేను చాలాసార్లు పలకరించుకునేవాళ్లం. భావజాలాన్ని పంచుకునేవాళ్లం. అకస్మాత్తుగా జార్జ్ చనిపోయాడని తెలియగానే నాకు చాలా బాధ కలిగింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు అప్పటి రోజులు నా కళ్లముందు మెదిలాయి. సినిమా చూసి వచ్చి పడుకుంటే, జార్జిరెడ్డితో పాటు అప్పటి సన్నిహితులు గుర్తొచ్చి ఆ రాత్రి నిద్ర అస్సలు పట్టలేదు’ అని పరుచూరి తెలిపారు.