వయసు 96.. కుర్రాళ్లకు లేఖలు - MicTv.in - Telugu News
mictv telugu

వయసు 96.. కుర్రాళ్లకు లేఖలు

April 20, 2018

కొంతమందికి ఏవేవో కారణాల వల్ల జరగాల్సిన సమయంలో కొన్ని జరగవు. కొందరికి లేటుగా పెళ్లిళ్లు అవుతాయి. కొందరికి చదువు కూడా లేటుగా అందుతుంది. కానీ వయసుపైబడ్డాక తామే కోల్పోయాలో అర్థమవుతుంది. దాంతో మళ్లీ పరుగులు పెడతారు. మెక్సికోకు చెందిన 96 ఏళ్ల ముదుసలి గువడలూపె పాలాసియోస్‌ కథ కూడా ఇలాంటిందే.

పేదరికం వల్ల పాలా చిన్నప్పుడు చదువుకు దూరమైంది. పెళ్లయ్యాక భర్త, పిల్లే లోకమయ్యారు. భర్త నడిపే చికెన్ దుకాణంలో పనిచేస్తూనే ముసలిదైపోయింది. అయితే బాధ్యతలన్నీ తీరిపోయాక ఆమెకు చదువుపై మళ్లీ ఆసక్తి పెరిగింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న వయోజనుల అక్షరాస్యత పాఠశాలతో చేరింది. చిన్నచిన్న పిల్లలతో కలసి అక్షరాలు నేర్చుకుంది. కేవలం నాలుగేళ్లలోనే ప్రాథమిక, మాధ్యమిక విద్యను విజయవంతంగా పూర్తి చేసింది. ఉత్తరాలు రాయడం కూడా నేర్చుకుంది..‘నాకు చాలా సంతోషంగా ఉంది…నేనిప్పుడు నా బాయ్‌ఫ్రెండ్స్‌కు లేఖలు కూడా రాయగలుగుతున్నాను…’ అని తెగసిగ్గపడుతూ చెబుతోంది పాలా. తన వందో పుట్టినరోజుకల్లా ఉన్నత విద్యను పూర్తి చేయాలన్నది బామ్మ సంకల్పం. సోమవారం ఉన్నత పాఠశాలలో చేరిన ఈ అవ్వకు అడ్వాన్స్‌గా కంగ్రాట్స్ చెప్పేయండి.