జగన్ బాబాయి ఇంట్లో అఘోరాలు.. ప్రత్యేక పూజలు!
టీటీడీ చైర్మన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఇంటికి హిమాలయాల నుంచి అఘోరాలు వచ్చారు. సుబ్బారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. వాళ్లు ఎందుకొచ్చారు? ఏ పూజలు చేశారని చర్చలు జోరుగా సాగుతున్నాయి. సాధారణంగా అఘోరాలు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకుంటారు. సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి వారు ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తోంది. వారు అఘోరాల ఆశీసులు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సుబ్బారెడ్డితో పాటుగా బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు నివాసంలోనూ అఘోరాలు కనిపించారు. వారిని హిమాలయాల నుంచి ప్రత్యేక ఖర్చులతో తమ నివాసాలకు తీసుకొచ్చారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా వారు స్పందించలేదు. అయితే వారు ఎప్పుడు వచ్చారు.. ఈ ఫోటోలు ఎప్పటివి అనేవి తెలియరాలేదు. కాగా, వైవీ సుబ్బారెడ్డి సైతం గతంలో లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. గోకరాజు గంగరాజు సైతం నర్సాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు.