కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకం విషయంలో ఓ కీలక ప్రకటన చేసింది. ‘అగ్నిపథ్’ ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు సంబంధించి, గరిష్ట వయోపరిమితిని రెండేళ్లపాటు పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అంటే 23 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు అని తెలిపింది. కానీ, 2022 నియామకాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. త్రివిధ దళాల్లో అగ్నిపథ్ పథకం కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 17.5 నుంచి 21 ఏళ్లుగా కేంద్రం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి సైనిక నియామకాలను కేంద్రం చేపట్టలేదు. ఈ ఏడాది కొంత సడలింపు ఇచ్చింది. 2022 నియమకాలకు సంబంధించి, అర్హతను గరిష్టంగా 23 ఏళ్లకు పెంచుతూ నేడు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది.
“కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకం దేశ రక్షణ వ్యవస్థలో భాగం కావడానికి, దేశ సేవ చేయడానికి యువతకు ఒక బంగారం లాంటి అవకాశం. గత రెండేళ్లలో నియామకాలు చేపట్టని కారణంగా సైన్యంలో చేరాలనుకున్న వారికి అవకాశం లభించలేదు. యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్నివీరుల నియామకానికి ఈ ఏడాది వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు. ఈ మినహాయింపు ఒకసారికి మాత్రమే. దీనివల్ల అనేక మందికి అగ్ని వీరులుగా మారేందుకు అర్హత లభిస్తుంది. నేను ప్రధాన మంత్రికి యువకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెంటనే యువకులంతా అందుకు సన్నద్ధం కావాలి” అని రాజ్ నాథ్ సింగ్ ట్విట్ చేశారు.