సికింద్రాబాద్ రైల్యే స్టేషన్లో ‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ నేడు ఉదయం భారీ ఎత్తున యువకులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్యే స్టేషన్‌లోని పలు రైళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. దాంతో ఆందోళన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది.
సికింద్రాబాద్ పరిధిలోని 71 రైళ్లతోపాటు, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తూ, ప్రకటన విడుదల చేసింది. ప్రయాణంలో ఉన్న ఎక్కడి రైళ్లను అక్కడే నిలిపివేసింది. వరంగల్ రైల్వే స్టేషన్లోను పలు రైళ్లను ఆపివేసింది. రైళ్లన్నీ ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లర్లు సద్దుమణిగిన తర్వాతే మళ్లీ రైల్వే నడుస్తాయని అధికారులు చెబుతున్నారు.
మరోపక్క ఏపీ, తెలంగాణలో ఉన్న అన్ని రైల్యే స్టేషన్లు అధికారులు మూసేశారు. విజయవాడ రైల్యేస్టేషన్ వద్ద పోలీసులతో భారీ బందోబస్తును పెంచారు. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను, నాంపల్లి స్టేషన్లో లోకల్ రైళ్లను రద్దు చేశారు. ఇక, హైదరాబాద్-శాలీమార్, ఉందానగర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్, సికింద్రాబాద్-రేపల్లే, షిరిడీసాయి నగర్-కాకినాడ పోర్టు, భువనేశ్వర్-ముంబై రైళ్లను అధికారులు రద్దు చేశారు.
అనంతరం భువనేశ్వర్-ముంబై సీఎస్టీ రైలును దారి మల్లించారు. భువనగిరి జిల్లాలోని నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్‌ప్రెస్‌తోపాటు, పలు గూడ్స్ రైళ్లను నిలిపివేశారు. హావ్‌డా-సికింద్రాబాద్ రైలు, సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైళ్లను మౌలాలిలో, గుంటూరు-వికారాబాద్ రైలును చర్లపల్లిలో నిలిపివేశారు.