'అగ్నిపథ్' అల్లర్లు: పోలీసుల అదుపులో సూత్రధారి - MicTv.in - Telugu News
mictv telugu

‘అగ్నిపథ్’ అల్లర్లు: పోలీసుల అదుపులో సూత్రధారి

June 18, 2022

కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిపథ్ ఆందోళనలు తాజాగా హైదరాబాద్‌ను తాకాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్యేస్టేషన్‌లో నిరసనకారులు భారీ ఎత్తున రైళ్లకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపు చేసే క్రమంలో కాల్పులు జరిపారు. దాంతో ఒకరు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ అల్లర్లకు కారణం ఎవరు? ఎవరు అల్లర్లను ప్రోత్సాహించారు? ఎవరు ప్రధాన సూత్రధారి? అనే విషయాలపై లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా అల్లర్లకు కారణమైన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని ప్రకాశం జిల్లా కంభంలో అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. అల్లర్లలో సుబ్బారావు పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు నేడు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావుతోపాటు ఈ అల్లర్లకు సంబంధించి, ఇప్పటివరకు మరో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, మరో 12 మంది యువకులు ప్రధాన కారకులుగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను కొందరు రెచ్చగొట్టి, వాట్సాప్ గ్రూపుల్లో వాయిస్ మేసేజ్‌లు, కథనాలు పంపించినట్లు తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్స్, 17/6 గ్రూప్‌లోపాటు పలు పేర్లతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో అల్లర్లకు ముందే ఆందోళనకారుల వాట్సాప్‌లకు సందేశాలు పంపించినట్లు స్పష్టం చేశారు. పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ ఆకాడమీ డైరెక్టర్ ఆవుల సబ్బారావు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతుండడంతో సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. మరోపక్క కరీంనగర్‌కు చెందిన స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీం పైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.