‘అగ్నిపథ్’ పేరిట త్రివిధ దళాల్లో నియామకాల విషయంలో కేంద్రం నూతన విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది యువతకు సాయుధ బలగాల్లో పని చేసే అవకాశం కల్పించేలా కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. కాగా ఈ పథకంపై దేశంలోని పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్మెంట్కు ప్రిపేర్ అవుతున్న పలువురు యువకులు మండిపడుతున్నారు. కేవలం నాలుగేళ్లు మాత్రమే సర్వీసు అంటే ఆ తర్వాత ఇతర ఉద్యోగాల కోసం మళ్లీ చదువుకొని ఇతరులతో పోటీపడాల్సి ఉంటుందంటున్నారు.
ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్, చైనాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ.. అగ్నిపథ్ పథకంతో మన భద్రతా దళాల నిర్వహణా సామర్థ్యం తగ్గుతుందన్నారు. మన భద్రతా దళాల గౌరవం, సంప్రదాయాలు, క్రమశిక్షణ విషయంలో రాజీపడటాన్ని బీజేపీ ప్రభుత్వం తప్పనిసరిగా మానుకోవాలని హితవు పలికారు. ఈ పథకం దేశానికి గానీ, యువతకు గానీ అనుకూలంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా విమర్శించారు.
రిటైర్డ్ మేజర్ జనరల్ బీఎస్ ధనోవా.. కొత్తగా నియమించుకొనే వారికి కనీసం ఏడేళ్ల పాటు సర్వీసు ఉండేలా చూడాలని, వీరిలో 50 శాతం మందిని శాశ్వత సర్వీసుల్లోకి తీసుకొనేలా చేయడం మంచిదని ట్వీట్ చేశారు. సైనిక బలగాల రిక్రూట్మెంట్ను కేవలం ఆర్థికపరమైన కోణంలోనే చూడటం సరికాదని సీనియర్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ యష్ మోర్ అన్నారు.