ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ కి ఇంటిపన్ను, భూమి పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ ఈ మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి నోటీసులు పంపింది. పన్ను చెల్లించేందుకు పక్షం రోజుల గడువు విధించింది. తాజ్ మహల్ తో పాటు యమునా నదిని ఆనుకొని ఉన్న స్మారక చిహ్నం ఎత్మాద్ ఉద్ దౌలాకు కూడా నవంబర్ 25న నోటీసులు ఇచ్చారు. అయితే తాము కేవలం తాజ్ మహల్ సంరక్షణ బాధ్యతలు మాత్రమే చూస్తామని ఆర్కియాలజీ విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నోటీసులపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన వారు.. బ్రిటీష్ హయాం నుంచి ఇప్పటివరకు పన్ను కట్టమని నోటీసులు పంపలేదని ఇదే మొదటిసారని వాపోతున్నారు. మార్చి 31 వరకు భూమి పన్ను రూ. 88,784, దీనికి వడ్డీ రూ. 47,943 తో పాటు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ఇంటి పన్ను రూ. 11,098 చెల్లించాలని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సరితా సింగ్ పేరుతో నోటీసులు పంపారు. మరి సందర్శకుల నుంచి ఫీజు వసూలు చేసే ప్రభుత్వం ఈ పన్ను చెల్లిస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.