Agreement with Bangladesh on Kushiara river: PM Modi
mictv telugu

కుషియారా నదిపై బంగ్లాదేశ్‌తో ఒప్పందం : ప్రధాని మోదీ

September 6, 2022

భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఈ భేటీ జరుగగా, అనంతరం వారు మీడియా ముందుకు వచ్చి భేటీ వివరాలను వెల్లడించారు. మోదీ మాట్లాడుతూ..‘రెండు దేశాల మధ్య 54 నదులు ప్రవహిస్తున్నాయి. కుషియారా నదిపై బంగ్లాదేశ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం పెరుగుతోంది. బంగ్లాదేశ్ తన ఎగుమతులను ఎక్కువగా భారత్‌కే చేస్తుంది. ఐటీ, అంతరిక్షం, అణు శక్తి రంగాల్లో మరింత సహకరించుకోవాలని నిర్ణయించాం. విద్యుత్ పంపిణీ లైన్లపై చర్చలు జరుగుతున్నాయి. వరదలు, విపత్తు నిర్వహణలో రియల్ సమాచార మార్పిడి బంగ్లాదేశ్‌తో పంచుకుంటా’మని వెల్లడించారు. తర్వాత షేక్ హసీనా మాట్లాడుతూ..‘భారత్‌కు రావడం నాకెప్పుడూ సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మాదేశ విముక్తి పోరాటంలో భారత్ సహాయం మరచిపోలేము. మాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. మంచి మిత్రదేశంగా భారత్ వ్యవహరిస్తోంది. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ విజయవంతంగా జరుపుకున్న భారత ప్రభుత్వం, ప్రజలకు అభినందనలు’ అని పేర్కొన్నారు. తర్వాత తన తండ్రి ముజిబర్ రెహ్మాన్ ప్రసంగానికి సంబంధించిన పుస్తకాన్ని మోదీకి బహూకరించారు. అటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలతో హసీనా భేటీ అయ్యారు. కాగా, చివరిసారిగా హసీనా 2019లో భారత్‌లో పర్యటించారు.