ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించండి.. నితీశ్ డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించండి.. నితీశ్ డిమాండ్

October 23, 2019

Nitish Kumar.

కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ సైతం రాష్ట్ర హోదా కోసం ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా బిహార్‌కు కూడా ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని నితీష్ అన్నారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బిహార్‌కు మేము ప్రత్యేక హోదా కోరుతున్నాం. అలాగే ఢిల్లీకి కూడా రాష్ట్ర హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను ఇది వరకే కేంద్రం తోసిపుచ్చింది’ అని నితీశ్ తెలిపారు. 

ఢిల్లీలో పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని నితీశ్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం జేడీయూ, ఎన్డీయే భాగస్వామి అయిన విషయం తెలిసిందే. అయితే ఆ పొత్తు బిహార్‌కు మాత్రమే పరిమితమని ఇదివరకే నితీశ్‌ చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బిహార్‌, పూర్వాంచల్‌ నుంచి వలస వచ్చిన ఓటర్లపైనే నితీశ్‌ ఆశలు పెట్టుకున్నారు. అందులో భాగంగానే నితీష్ ‘హోదా’ డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఢిల్లీలో ఆప్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రధానంగా బరిలో నిలబడ్డాయి.