ahead Of Munugode Bypoll, Dasoju Sravan To Join TRS From BJP
mictv telugu

బీజేపీకి బిగ్ షాక్.. దాసోజు శ్రవణ్ రాజీనామా..

October 21, 2022
మునుగోడు ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఈ మధ్యే కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లిన దాసోజు శ్రవణ్.. తాజాగా ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన ఆయన..రెండు నెలల ముందు బీజేపీలో చేరారు. అయితే రాష్ట్రంలోని బీజేపీ నేతల పట్ల అసంతృప్తిగా ఉన్న శ్రవణ్.. బీజేపీ దశ, దిశ లేని రాజకీయాలు చేస్తున్నాయని , అవి తెలంగాణ సమాజానికి ఉపయోగకరం కాదంటూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పంపారు. మునుగోడులో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని, సామాజిక బాధ్యత లేకుంగా ఎన్నికలనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలే, పెట్టుబడి రాజకీయాలు చేసే ఈ పార్టీలో తన లాంటి వాళ్లకి స్థానంలేదని అర్ధమైందని లేఖలో తెలిపారు.
అనేక ఆశలతో, ఆశయాలతో బీజేపీ చేరానని, కానీ దశాదిశాలేని నాయకత్వ ధోరణులు నిర్మాణాత్మక రాజకీయాలు ఉపయోగకరంగా లేవని చాలా తక్కువ సమయంలోనే అర్ధమైందని అన్నారు. ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాసం, నోట్లు కట్టలు పంచి మునుగోడు లో గెలవాలనుకుంటున్నారని నిరసన తెలుపుతూ రాజీనామా లేఖను బండి సంజయ్ కు పంపారు. అయితే దాసోజు శ్రవణ్ ఈ సాయంత్రం టీఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.