కస్టమర్ కోపం.. బ్యాంక్ సీపీయూనే ఎత్తుకెళ్లాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

కస్టమర్ కోపం.. బ్యాంక్ సీపీయూనే ఎత్తుకెళ్లాడు.. 

June 6, 2020

Ahmedabad jeweller carries off bank’s CPU

ఇప్పుడంతా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల మీదే ఎక్కువగా ఆధారపడ్డారు. బ్యాంకులన్నీ నెట్ బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో చాలామంది ఇంటి వద్ద నుంచే లావాదేవీలు జరుపుకుంటున్నారు. అయితే ఒక్కోసారి నెట్ సమస్య వల్లో, బ్యాంక్ సర్వర్ పనిచేయకపోవడం వల్ల నెట్ బ్యాంకింగ్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అప్పుడు మానకు అత్యవసర పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. సహనం కోల్పోయిన అతను బ్యాంకుకు వెళ్లాడు. అంతటితో ఆగకుండా బ్యాంకులోని సీపీయూ ఎత్తుకెళ్లాడు. అహ్మదాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్పీ జ్యువెలర్స్ యజమాని సుజయ్ షా ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఓ మెయిల్ పంపించాడు. తనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని, వెంటనే సరిచేయాలని కోరాడు. అయితే, అతని మెయిల్‌కు బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సుజయ్ మకర్బా బ్రంచ్‌కు వెళ్లాడు.

బ్రాంచ్ మేనేజర్ వినీత్ గురుదత్తాను కలిసి ఏకంగా వాగ్వాదానికే దిగాడు. వెంటనే తనకు నెట్ బ్యాంకింగ్ సేవలు అందించాలని.. లేకపోతే బ్యాంకులో సీపీయూను తీసుకెళ్లిపోతానని హెచ్చరించాడు. దీంతో గురుదత్తా ఐటీ టీమ్‌తో అతని సమస్యను వివరిస్తున్న సమయంలోనే.. సుజయ్ బ్యాంకులోని ఓ కంప్యూటర్ సీపీయూను పీకేశాడు. అతడి చర్యను సిబ్బంది అడ్డుకున్నా వినకుండా సీపీయూను ఇంటికి ఎత్తుకెళ్లిపోయాడు. ఆ తర్వాతి రోజు తిరిగి బ్యాంకులో ఇచ్చేశాడు. అయితే, అప్పటికే అతడు చేసిన ఘనకార్యంపై బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. బ్యాంకు సొత్తును చోరీ చేసిన కారణంగా అతనిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.