దొండపాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. అప్పిరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

దొండపాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. అప్పిరెడ్డి

February 17, 2018

మాతృభూమి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది అని ఏహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి పేర్కొన్నారు. దొండపాడు గ్రామానికి, గ్రామస్తుల సంక్షేమానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. శనివారం ఆయన తన స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా దొండపాడు గ్రామంలో జరిగిన ఆదెమ్మ, హుస్సేన్ రెడ్డి(ఏహెచ్ఆర్) ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం, డిజిటల్ దొండపాడు ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

చేయూత కావాలి.. అందరి సహకారంతోనే..

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం వంటి కనీస అవసరాలు అందాలని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత లేక రాణించలేకపోతున్నారని, వారికి చేయూతనివ్వాలని కోరారు. సాధారణ విద్యార్థులకు కూడా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటే వారూ గొప్ప విజయాలు సాధిస్తారని వ్యాఖ్యానించారు. ఈ దిశగా ఏహెచ్ఆర్ ఫౌండేషన్ పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక, ఇతర సాయాన్ని అందిస్తోందన్నారు. దొండపాడు అభివృద్ధి కోసం తాను చేస్తున్న యత్నాలకు ఎందరో సహకరిస్తున్నారని, వారందరికీ ధన్యావాదాలు చెబుతున్నానన్నారు.

‘దొండపాడు అభివృద్ధికి ఇకముందు కూడా నా శాయశక్తులా కృషి చేస్తాను. గ్రామంలోని యువతకు ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తాను. ఇది ఇప్పటితో ఆగేది కాదు. భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించడానికి మనం అన్ని ప్రయత్నాలూ చేయాలి..’ అని అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.

విద్యార్థులకు ఆర్థిక సాయం…

విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్న ఏహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత అప్పిరెడ్డి

ఏహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున ఈ విద్యాసంవత్సరానికి గాను 80 మంది విద్యార్థులకు రూ. 4లక్షలకుపైగా ఆర్థిక సాయాన్ని అప్పిరెడ్డి చెక్కురూపంలో అందించారు. విద్యార్థులు ఆటంకాలను అధిగమించి లక్ష్యాలు సాధించాలని, తమ ఫౌండేషన్ వారికి అన్నిరకాల చేయూత అందిస్తుందని చెప్పారు. చదువులో రాణిస్తున్న విద్యార్థులను ఆయన పేరుపేరునా అభినందించారు. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక సాయం కోసం ఫౌండేషన్‌కు ఇప్పటివరకు 150 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే ఏడాది 200 మంది విద్యార్థుల చదువుకు సాయం చేయాలని ఫౌండేషన్ యోచిస్తోంది.