Aicc Issued Showcause Notice To Komatireddy Venkat Reddy
mictv telugu

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై అధిష్టానం సీరియస్

October 23, 2022

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ కాంగ్రెస్ నేతకు ఫోనే చేశారు. ఆ కాంగ్రెస్ లీడర్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో రెండ్రోజుల కిందట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసి బీజేపీకి ఓటేయాలని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తుండడం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. అటు సోదరుడు, ఇటు కాంగ్రెస్ పార్టీ… ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారానికి దూరంగా ఉండాలని కుటుంబంతో సహా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడా కూడా కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి మాట్లాడారు. అక్కడ తన అభిమానులతో.. గెలవని పార్టీకి ప్రచారం చేసినా వేస్ట్ అని, తాను ప్రచారం చేస్తే మహా అయితే ఓ పదివేల ఓట్లు వస్తాయేమోనని వ్యాఖ్యానించారు.