ఏఐసీటీఈ ప్రకటన.. బీటెక్ ఫీజులు ఖారారు - MicTv.in - Telugu News
mictv telugu

ఏఐసీటీఈ ప్రకటన.. బీటెక్ ఫీజులు ఖారారు

May 19, 2022

దేశవ్యాప్తంగా బీటెక్ చదువుతున్న, రానున్న రోజుల్లో బీటెక్ చేయనున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్ కోర్సులకు సంబంధించిన ఫీజులను ఖారారు చేస్తూ, ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. కనిష్ఠంగా రూ.79,600, గరిష్టంగా రూ.1,89,800 ఫీజులను ఖరారు చేసింది.

ఇటీవలే జాతీయ ఫీజుల కమిటీ సమర్పించిన నివేదికను విడుదల చేసినట్లు ఏఐసీటీఈ తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో 2015లో బోధన రుసుములు నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ గతేడాది ఆగస్టులో నివేదిక సమర్పించింది. దీనిపై రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానించి, చర్చించేందుకు మరో ఉపకమిటీని నియమించింది. ఇప్పుడు తుది నివేదికను విడుదల చేసింది.

”బోధన రుసుముల్లో 15శాతం కళాశాల అభివృద్ధి ఫీజులను వసూలు చేసుకోవచ్చు. కళాశాల విస్తరణ, ముఖ్యమైన మరమ్మతులు, ప్రయోగశాల పరికరాలు, ఫర్నిచర్ కోసం వీటిని వినియోగించుకోవచ్చు. చాలా కాలంగా కళశాలల యాజమాన్యాలు ఫీజుల విషయంలో లేఖలు రాశారు. ఆ కారణంగానే కనీస, గరిష్ట ఫీజులను నిర్ణయించేందుకు కమిటీని నియమించాం.”