ఏఐసీటీఈ ప్రకటన.. ఉచితంగా బీటెక్ సీట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఏఐసీటీఈ ప్రకటన.. ఉచితంగా బీటెక్ సీట్లు

May 15, 2022

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) శుభవార్త చెప్పింది. జాతీయ, అంతర్జాతీయ పోటీలైన ఇన్‌స్పైర్, హ్యాకథాన్, కిషోర్ వైజ్ఞానిక ప్రోత్సాహన్ యోజన, నాసాకాంట్స్ వంటి వాటిల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉచితంగా బీటెక్ సీట్లు ఇస్తామని ప్రకటన విడుదల చేసింది.

”కొంతమంది విద్యార్థులు చదువు విషయంలో పెద్ద ర్యాంకులు తెచ్చుకోకపోయినా, కొత్తగా ఆలోచిస్తుంటారు. యాంత్రాలను, పరికరాలను తయారు చేస్తుంటారు. సమస్యలను లోతుగా అర్ధం చేసుకొని, ఎలాగైనా పరిష్కారం వెతుక్కొని మరి ప్రతిభావంతులుగా పేరు తెచ్చుకుంటారు. అట్లాంటి ప్రతిభావంతులను ఏఐసీటీఈ ప్రోత్సాహిస్తుంది. వారు జేఈఈ మెయిన్స్, ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాసినా, రాయకున్నా ర్యాంకులు వచ్చిన రాకున్నా ఉన్నత ప్రమాణాలున్న కళాశాలల్లో బీటెక్‌లో చేరేలా అవకాశం కల్పిస్తుంది. అట్లాంటి ప్రతిభావంతులు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆయా కళాశాలలకు వెళ్లి, ఎంపికలు చేస్తాం” అని అధికారులు అన్నారు.

ఎవరు అర్హులు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతలు, కేంద్ర సైన్స్- టెక్నాలజీ విభాగం (డీఎసీ), బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), సీఎఆర్, ఎన్‌సీఈఆర్టీ, కేంద్ర విద్యాశాఖ, డీఆర్డీఓల నుంచి ప్రాజెక్టులకు నిధులు పొందిన వారు. గుర్తింపు పొందిన బహుళ జాతి, స్వచ్ఛంద సంస్థల (గూగుల్, బెల్ ల్యాబ్స్, ఇంటెల్, టీసీఎస్, ఐబీఎం, టెస్లా, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, లాహీడ్ మార్టిన్,స్టెమ్ తదితర) నుంచి నిధులు పొందిన వారు. యూజీసీ గుర్తించిన కేర్-2 జర్నళ్లలో పరిశోధన పత్రాలు ప్రచురితమైన వారు. జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లు పొందిన వారు. ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీలైతే 40 శాతం, ఇతరులైతే 45 శాతంతో ఉత్తీర్ణులై, ఇంజినీరింగ్ చదవాలన్న ఆసక్తి ఉన్నవారు అర్హులని అధికారులు పేర్కొన్నారు.