అమ్మ పార్టీని వదిలేసి అయ్య పార్టీతో దోస్తీ! - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మ పార్టీని వదిలేసి అయ్య పార్టీతో దోస్తీ!

November 6, 2017

తమిళనాడులో బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ పరిస్థితికి తగ్గట్టు చకచకా పావులు కదుపుతోంది. పొత్తు కోసం అన్నాడీఎంకేతో ఇంతవరకు జరిపిన యత్నాలను పక్కనబెట్టి ఇప్పుడు డీఎంకేవైపు చూస్తోంది. మోదీ సోమవారం చెన్నైలో డీఎంకే చీఫ్ కరుణానిధిని కలుసుకుని ముచ్చటించడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. అధికార అన్నాడీఎంకేలో అధిపత్యం కోసం సాగుతున్న కుమ్ములాటలు బీజేపీని సందేహంలో పడేశాయి. పళని, పన్నీర్ వర్గాల మధ్య రాజీ కుదర్చడానికి ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం నెరిపినా ఫలితం లేకపోయింది. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో అమ్మ పార్టీ గెలుపు కష్టమేనని కమలనాథులు యోచిస్తున్నారు. అందుకే అన్నాడీఎంకేతో బలంతో తీసిపోని కరుణ పార్టీపై కన్నేశారు. అందులో భాగంగానే మోదీ చెన్నై వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అనారోగ్యంతో బాధపడుతున్న కరుణను ఢిల్లీకి వచ్చిన తనింట్లో విశ్రాంతి తీసుకోవాలని మోదీ కోరారు. మోదీని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, డీఎంకే ఎంపీ కనిమొళి ఘన స్వాగతం పలికి ఇంట్లోకి తీసుకెళ్లారు. దోస్తీ, కరుణ భేటీ రాజకీయమేనని వస్తున్న వార్తలను డీఎంకే తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై అప్పుడే దుమారం రేగింది. బ్రాహ్మణవాద పార్టీ అయిన బీజేపీతో బ్రాహ్మణవాద వ్యతిరేక పార్టీ అయిన డీఎంకే ఎలా జట్టుకడుతుందని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు.