జయలలిత నెచ్చెలి వి.శశికళపై అన్నాడీఎంకే ఊహించినట్టుగానే వేటు వేసింది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆమె సోదరి కొడుకు దినకరన్ ను కూడా తప్పించింది. మంగళవారం చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్యసమావేశంలో ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకునక్నారు. పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిగా జయలలితనే భావిస్తామని పేర్కొన్నారు. జయ నియమించిన ఆఫీస్ బేరర్స్ ను వారి పదవుల్లో ఇకపైనా కొనసాగించాలని నిర్ణయించారు. వివాదాస్పదమైన రెండాకుల గుర్తు కూడా తమకే చెందుతుందని స్పష్టం చేశారు.
అక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉండడం తెలిసిందే. జయ మరణం తర్వాత పార్టీని తన చేతుల్లోకి తీసుకుని, సీఎం కావాలన్న ఆమె ఆశలకు అక్రమాస్తుల కేసు గండికొట్టింది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, ప్రస్తుతం సీఎం యడపాటి పళనిస్వామిలు తమ విభేదాలు మరిచి ఏకతాటిపైకొచ్చి శశికళను ఇక కోలుకోలేని దెబ్బ కొట్టారు. జయ ఆఖరి క్షణాలల్లో ఆమెను అంటిపెట్టుకుని, ఎవరూ జయను కలవకుండా చేసిన శశికళపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జయకు ఆమె విషమిచ్చి చంపిందని కూడా శశికళ వ్యతిరేకులు ఆరోపించారు.