ఎన్డీయేలోకి అన్నాడీఎంకే! - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్డీయేలోకి అన్నాడీఎంకే!

August 22, 2017

అంతర్గత ముఠా తగాదాలతో రోడ్డున పడి నిన్ననే ఏకతాటిపైకి వచ్చిన అన్నాడీఎంకే రేపోమాపో కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిలో చేరే అవకాశముంది. ‘అమ్మ’ పార్టీ చీలిక గ్రూపుల వీలీనం కోసం బీజేపీ తన వంతు పాత్ర పోషించడం తెలిసిందే. స్వయంగా ప్రధాని మోదీతో పన్నీర్ సెల్వం, పళనిస్వామి విడివిడిగా భేటీ అయిన విలీనంపై కసరత్తు చేశారు.

తమిళనాడులో ఖాతా తెరవడంలో భాగంగా బీజేపీ అన్నాడీఎంకే వ్యవహారాల్లో వేలు పెడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నైనా సీట్లు కొల్లగొట్టుకోవచ్చన్నది ఆ పార్టీ ఆలోచన. అన్నాడీఎంకే విలీనాన్ని స్వాగతిస్తూ ప్రధాని మోదీ స్వయంగా టీట్ చేయడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే త్వరలోనే కేంద్ర కేబినెట్ లో చేరుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు పలికిన అన్నాడీఎంకే ఎన్డీఏ పంచన చేరడం ఇక లాంఛనమేనని భావిస్తున్నారు.