హెచ్ఐవీ – ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలకు ఇప్పటివరకు రక్తనమూనాలను సేకరిస్తుండగా, ఇకనుంచి నోటిలోని లాలాజలంతో నిర్ధారించే వెసులుబాటు రానుంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, చెన్నైకి చెందిన వాలంటరీ హెల్త్ సర్వీసెస్‌లు కలిసి ఈ కిట్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఓరా క్విక్ హెచ్ఐవీ సెల్ఫ్ టెస్ట్ పేరుతో ఈ కిట్‌ను రూపొందించారు. వీటితో ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, కర్నూలు, గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఫిబ్రవరి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. 3 నెలల వ్యవధిలో 2 లక్షల ఎయిడ్స్ పరీక్షలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో 19 వేల పరీక్షలు లక్ష్యంగా పెట్టుకోగా, 75 శాతం పూర్తయ్యాయి. ఎయిడ్స్ సోకిందనే అనుమానం ఉన్న వ్యక్తులు ఈ కిట్ ద్వారా మొదట పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఐసీటీసీ కేంద్రానికి వెళ్లి మరోసారి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తామని గుంటూరు జిల్లా కో ఆర్డినేటర్ భూషణ్ తెలిపారు. కాగా, వీటివల్ల కమర్షియల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు లాలాజలంతో టెస్టులు చేసుకోవచ్చు.