మీనాక్షి కతి.. మీనాక్రితి పేరుతో ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. దీంట్లో భాగంగా అప్పెన్ ఆర్ట్ను బతికించి మరికొందరికీ నేర్పిస్తున్నది. అంతేకాదు.. ఎంతోమందికి ఉపాధినిస్తున్నది.
ఉత్తరాఖండ్లోని కుమాన్ అనే గ్రామంలోని చిన్న చిన్న ఇండ్లని ఒకసారి గమనించండి. ఎర్రని గోడలకు తెల్లని ముగ్గులు వేసి అందంగా కనిపిస్తాయి. ఈ ఆర్ట్ని అప్పెన్ అంటారు. అన్నాన్ని పేస్ట్లా చేసి ఈ ఆర్ట్ని వేస్తారు. కేవలం కుడి చేతి మూడు వేళ్లను మాత్రమే ఉపయోగించాలి. ప్రాచీన ఈ కళని మీనాక్షి బ్రతికిస్తుంది. కేవలం గోడల మీదే కాదు.. వివిధ వస్తువుల మీద కూడా వేసి అమ్ముతుంది. మరికొందరు మహిళలకు ఈ కళను నేర్పించి వారికి ఉపాధి కల్పిస్తున్నది.
అప్పెన్.. ఈ కళ ఒకప్పుడు పెండ్లి, పండుగల సందర్భంలో వేసేవారు. ఇంచుమించు మనం అలికి ముగ్గు వేసినట్లుగానే కనిపిస్తుంది. అయితే రానురాను ఈ కళను ఉత్తరాఖండ్ ప్రజలు మరచిపోతున్నారు. 24యేండ్ల మీనాక్షి నైనిథాల్లో ఉంటుంది. ఈ ప్రాచీన కళ అంతరించిపోకూడదని అనుకుంది. తన పెద్దల ద్వారా ఈ కళను నేర్చుకుంది. కేవలం నేల మీదే కాదు.. టీ కప్పులు, ఇతర డెకరేటివ్ ఐటమ్స్ మీద కూడా వేయడం ప్రారంభించింది. ఇంట్లో వాటిని అందంగా అలంకరించేది. వాటిని చూసి బంధువులు, స్నేహితులు తమకూ కావాలంటూ అడుగడంతో ఈ కళను మరింత సీరియస్గా నేర్చుకుంది. వారికి ఆర్డర్ల మీద సరికొత్త ఐటమ్లను చేసి ఇచ్చేది. . అంతేకాదు.. సోషల్ మీడియాలో తన ఐటమ్స్ గురించి ప్రచారం చేసింది. అది చూసి తమకు నేర్పించమని అడిగేవారు. అలా 2019లో ‘మీనాక్రితి’ పేరుతో ఉత్తరాఖండ్లోని కొన్ని గ్రామాలకు వెళ్లి ఈ కళను నేర్పించింది. సరికొత్త ప్రయోగాలు చేసి కీ చెయిన్, నేమ్ ప్లేట్, వాల్ పెయింటింగ్లను కూడా వేసింది. దీంతో ఆర్డర్లు పెరిగాయి. ఒక్కదానిగా మొదలైన ఆమె ఇంకో 15మందికి ఈ కళ ద్వారా ఉపాధి కల్పిస్తున్నది.
ఆమె ఈ కళ గురించి టెడెక్స్లో కూడా మాట్లాడింది. ‘ప్రాచీనమైన ఈ కళను గురించి నేను గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడం నాకు చాలా గర్వంగా ఉంది. అప్పెన్ గురించి మరికొందరికి తెలియాలి. దీనికోసం అంతర్జాతీయ స్థాయిలో కూడా నేను మాట్లాడాలి అనుకుంటున్నా’ అంటున్నది మీనాక్షి. ప్రాచీన కళకు జీవం పోయడమే కాదు.. దాన్ని మరికొందరికి నేర్పించి మార్గనిర్దేశకురాలైంది మీనాక్షి. మరి ఆమె మరింత సక్సెస్ సాధించాలని మనమూ కోరుకుందాం.