ఎయిరిండియా విమానంపై ఏక్ ఓంకార్ గుర్తు - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిరిండియా విమానంపై ఏక్ ఓంకార్ గుర్తు

October 28, 2019

కస్టమర్ల మనోభావాలకు అనుగుణంగా ఎయిరిండియా ఓ మత చిహ్నాన్ని విమానంపైకి ఎక్కించింది. సిక్కుల మత గురువు గురునానక్‌ గౌరవార్థం  తమ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంపై సిక్కుమత గుర్తు అయిన ‘ఏక్ ఓంకార్’ (ఏకైక దైవం)ను ముద్రించింది. తోక భాగంలో ఎరుపు రంగుపై బంగారు వర్ణంలో దీన్ని తీర్చిదిద్దారు. అమృత్‌సర్ నుంచి లండన్‌కు నేరుగా విమానం నడపాలనే డిమాండ్‌ను తాము పరిగణనలోకి తీసుకున్నామని సంస్థ తెలిపింది. 

గురునానక్ 550వ జయంతి గురు పూరబ్ సందర్భంగా దీన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎండీ అశ్విని లోహోనీ వెల్లడించారు. పర్యాటకులను అలరించేందుకు విమానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దమని ఆయన తెలిపారు. తమ విమానాలు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంటాయని, అవి భారతదేశ సందేశాన్ని మానవాళికి చేరవేస్తాయని అన్నారు. సిక్కుమత స్థాపకుడైన గురునానక్ 550వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తుండడం తెలిసిందే. సిక్కు మతక్షేత్రాలను ఎయిరిండియా ప్రత్యేక విమానాలు నడుపుతోంది.