మోదీకి బీజేపీ ఎంపీ షాక్.. అమ్మితే కోర్టుకెక్కుతా... - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి బీజేపీ ఎంపీ షాక్.. అమ్మితే కోర్టుకెక్కుతా…

January 27, 2020

Subramanian Swamy.

కేంద్ర ప్రభుత్వం సోమవారం ఎయిరిండియాలో వంద శాతం వాటాలను విక్రయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియా అమ్మకానికి సంబంధించి ప్రిలిమనరీ బిడ్లను కూడా ఆహ్వానించింది. దీనికి మార్చి 17ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. మోదీ ప్రభుత్వపు ఎయిరిండియా విక్రయంపై సొంత పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మోదీకి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ రంగ కంపెనీ ఎయిరిండియాలో వాటాలను పూర్తిగా విక్రయించడానికి ముందడుగు వేస్తే తాను కోర్టుకెక్కుతానని  సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరించారు. ఇది జాతి వ్యతిరేక నిర్ణయమని ట్వీట్‌ చేశారు.

మరోవైపు మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ విరుచుకుపడ్డారు. ‘ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. అందుకే ఇలాంటి పనులు చేస్తోంది. వృద్ధి 5 శాతం దిగువకు పడిపోయింది. రూ.కోట్లు బకాయిలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పేరుకుపోయాయి. విలువైన ఆస్తులను విక్రయిస్తున్నారు’ అని కపిల్‌ సిబల్‌ ఆరోపించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం  ప్రతికూల అంశాలతో సతమతమౌతోంది. ప్రభుత్వానికి అంచనా వేసిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. దీంతో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలను తెరమీదకు తెచ్చింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థల్లోని కేంద్ర వాటాలను విక్రయిస్తోంది. ఎయిరిండియా‌ నుంచి పూర్తిగా తప్పుకోవాలని కేంద్రం భావిస్తోంది.