టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా భారీ మొత్తంలో 840 విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో మొదటి దశలో 470 విమానాల కొనుగోలుకు స్థిరమైన ఆర్డర్ ఇచ్చింది. మిగిలిన 370 విమానాల కొనుగోలు ఆఫ్షన్‌గా పెట్టుకున్నట్లు ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ (సీసీటీఓ) నిప్పన్ అగర్వాల్ చెప్పారు. అంతకుముందు 460 విమానాల కొనుగోలు మాత్రమే రికార్డులో ఉంది. 2011లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ పేరిట ఈ రికార్డు ఉంది. ఇప్పుడు టాటా గ్రూప్ తొలుత 470 విమానాల డీల్ కుదుర్చుకోగా.. మరో 370 విమానాలను దశాబ్ద కాలంలో కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ డీల్ విలువ సుమారు 70 బిలియన్ డాలర్లు. ఇది కొన్ని దేశాల జీడీపీ కంటే చాలా ఎక్కువ. ఈ డీల్ భారతదేశ పౌరవిమానయాన రంగాన్ని సమూలంగా మార్చడంతో పాటు.. అంతర్జాతీయ వేదికపై భారత్ హోదాను పెంచనుంది. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా ఈ డీల్ కి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. 2013లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ బోయింగ్‌కు ఇచ్చిన 76 బిలియన్ డాలర్ల ఆర్డర్ తర్వాత ఇదే అతిపెద్ద డీల్.
అంతకుముందు ఎయిర్‌బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఒకే సారి ఇంత భారీ స్థాయిలో విమానాలకు ఆర్డర్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఆఫ్షన్‌గా పెట్టుకున్న 370 విమానాలను వచ్చే 10 సంవత్సరాల్లో బోయింగ్, ఎయిర్‌బస్ నుంచి కొనుగోలు చేసే హక్కును ఎయిర్ ఇండియా కలిగి ఉంటుందని నిప్పన్ అగర్వాల్ చెప్పారు.