మన దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా.. ఇటీవలే 470 విమానాల కొనుగోలు కోసం ఎయిర్ బస్, బోయింగ్ సంస్థలతో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో విమానాలు అందనున్న నేపథ్యంలో ఇప్పుడు నియామకాలపై దృష్టి సారించింది. అందుబాటులోకి విమానాలకు సరిపడా ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపారు. ఈ ఏడాదిలో సుమారు 5100 మందిని ఉద్యోగంలోకి తీసుకుంటామని పేర్కొంది. దేశంలోని అనేక నగరాలతో పాటు అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడాది క్యాబిన్ సిబ్బంది 4200, పైలట్లు 900 మందిని మొత్తంగా 5100 మందిని నియమించుకుంటామని తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారందరికీ ఈ రిక్రూట్మెంట్లో అవకాశం కల్పిస్తామని సంస్థ తెలిపింది. ఎంపికైన వారిలో సేవా నైపుణ్యాలను పెంపొందించేందుకు 15 వారాల స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్లు చెప్పింది. ఈ శిక్షణను పొందే అభ్యర్థుల కోసం ముంబయిలో ప్రత్యేకంగా తరగతి గదులతో పాటు పలు ఫ్లైట్లలో ట్రైనింగ్కు ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది.”భవిష్యత్తులో మరి కొంతమంది పైలట్లు సహా ఇంజనీర్లను కూడా నియమించుకునే యోచనలో ఉన్నాం.” అని ఎయిర్ ఇండియా సర్వీసెస్ అధినేత సందీప్ వర్మ చెప్పారు.
గతేడాది 2022 మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2023 వరకు మొత్తంగా 1900 మంది క్యాబిన్ సిబ్బందిని నియమించుకున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా. జులై నుంచి జనవరి మధ్య 7 నెలల్లోనే కొత్తగా 1100 మందికి శిక్షణ ఇచ్చామని పేర్కొంది. అందులో 500 మందిని ఇప్పటికే వివిధ సేవల్లో నియమించుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 113 విమానాలు సేవలను కొనసాగిస్తున్నాయి.