మానయానం చేసే ప్రయాణికులు ఇకపై తమ బ్యాగేజీ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను బయటకు తీసి చూపాల్సిన అవసరం లేదని విమానయాన భద్రతా విభాగం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తెలిపింది. వాటిని తనిఖీ చేసేందుకు కంప్యూటర్ టోమోగ్రఫీ టెక్నాలజీని వినియోగించాలని సిఫారసు చేసింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లలో తనిఖీల కోసం బ్యాగుల నుంచి ఫోన్లు, ఛార్జర్లు, ల్యాప్‌టాప్ వంటివి బయటకు తీసి చూపించే బాధ తప్పనుంది. అలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను బ్యాగుల్లో నుంచే తనిఖీ చేసేలా అత్యాధునిక స్కానర్లను ఎయిర్‌పోర్టుల్లో ఏర్పాటు చేయాలని బీసీఏఎస్ ప్రతిపాదనలు చేసింది.
ప్రస్తుతం విమానాశ్రయాల్లో బ్యాగేజీలోని వస్తువుల టూ-డైమెన్షనల్ దృశ్యాలను చూపే స్కానర్లు ఉన్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్ టోమోగ్రఫీ పరికరాలను ఏర్పాటు చేస్తే త్రీడీ దృశ్యాలు కనిపిస్తాయని బీసీఏఎస్ జాయింట్ డైరెక్టర్ జనరల్ జైదీప్ ప్రసాద్ తెలిపారు. ఈ స్కానర్లతో ప్రయాణికులు ఇకపై తమ హ్యాండ్ బ్యాగేజీల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలను బయటకు తీసి ప్రత్యేక ట్రేలలో తనిఖీలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. దీనివల్ల, ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు వేగవంతం అవుతుందని, రద్దీ కూడా తగ్గుతుందని చెప్పారు. ఇటీవలి కాలంలో తనిఖీల వద్ద రద్దీ, ఆలస్యంపై ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వచ్చే ఏడాదిలో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ సహా ప్రధాన విమానాశ్రయాల్లో ఈ కొత్త స్కానర్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని కొన్ని జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.