తనను మోసం చేసిన ప్రియుడిని ఓ మహిళ టెక్నాలజీ సాయంతో అంతం చేసింది. అతడికి తెలియకుండా అతను వాడుతున్న వస్తువులపై జీపీఎస్ లాంటి ఓ ఆపిల్ ఎయిర్ టాగ్‌ను (చిన్న బటన్ వంటి పరికరం) ఫిక్స్ చేసి చాలా కిరాతకంగా చంపింది. అమెరికాలోని ఇండియానాపొలిస్‌లో ఈ ఘటన జరిగింది. గైలిన్ మోరిస్(26) అనే మహిళ.. తన ప్రియుడు ఆండ్రే స్మిత్ మరో స్త్రీతో సంబంధం పెట్టుకొని తనను వదిలేశాడని భావించి, ఎయిర్ టాగ్ సాయంతో అతడి ఆచూకీని తెలుసుకునేది. ఈ క్రమంలో ప్రియుడు ఆండ్రే స్మిత్ ఓ బార్ వద్ద ఉన్నాడని ఆపిల్ ఎయిర్ టాగ్ డేటా వెల్లడించడంతో, గైలిన్ ఆగ్రహంతో అక్కడికి వెళ్లి.. ప్రియుడితోపాటు ఆ మహిళపై కూడా దాడి చేసింది.
వెంటనే బార్ సిబ్బంది జోక్యం చేసుకుని, వారు ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆ బార్ ఎదుటే తన కారుతో అతడ్ని ఢీకొట్టి కడతేర్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పోలీసుల గైలిన్ మోరిస్ ను అరెస్ట్ చేశారు. ఇంతకీ గైలిన్ ఉపయోగించిన ఆపిల్ ఎయిర్ టాగ్ ఎలా పనిచేస్తుంటే… ఇది ఓ జీపీఎస్ వంటిదే. దీన్ని ఆపిల్ ఫోన్, ఐపాడ్ వంటి సాధనాల ద్వారా నియంత్రించవచ్చు. ఈ ఎయిర్ టాగ్ ను ఏదైనా వస్తువుకు అంటిస్తే…. ఆ వస్తువును ఎక్కడున్నా ట్రేస్ చేయొచ్చు. ‘ఫైండ్ మై’ అనే యాప్ లో సదరు ఎయిర్ టాగ్ డేటా చూసుకోవచ్చు.