అక్టోబర్ 1న 5జీ లాంఛ్ అయిన తర్వాత తమ కవరేజ్‌ను టెలికాం ఆపరేటర్లు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. విడతలవారీగా దేశంలోని ప్రముఖ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. భారతీ ఎయిర్ టెల్ సంస్థ 5జీని మరింత వేగంగా విస్తరిస్తుంది.
తాజాగా ఏపీలోని ప్రధాన నగరమైన విశాఖలో ఎయిర్ టెల్ సంస్థ 5జీ సేవలను ప్రారంభించింది. నగరంలోని ద్వారకానగర్, బీచ్ రోడ్, దాబా గార్డెన్స్, మద్దిలపాలెం, వాల్తేర్ అప్ ల్యాండ్స్, పూర్ణా మార్కెట్, గాజువాక జంక్షన్, ఎంవీపీ కాలనీ, రాంనగర్, రైల్వేస్టేషన్ రోడ్డు, తెన్నేటి నగర్ సహా పలు ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. కొద్దిరోజుల్లో నగరవ్యాప్తంగా 5జీ సేవలను అందించనున్నట్లు పేర్కొంది. యూజర్స్ 5 జీ సేవలు కోసం ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని.. 5జీ సపోర్ట్ చేసే మొబైల్ ఉంటే సరిపోతుందని పేర్కొంది. దీనికోసం సిమ్ మార్చే అవసరం లేదని తెలిపింది. 4జీ సేవలు పొందుతున్న వినియోగదారులు ఉచితంగానే 5జీ సేవలు పొందొచ్చని ఎయిర్ టెల్ వెల్లడించింది.