Airtel chairman bharathi mittal praises telecom deportment
mictv telugu

డబ్బులిచ్చిన గంటల్లోనే పనైపోయింది.. ఎయిర్ టెల్ చైర్మెన్ ఆశ్చర్యం

August 18, 2022

కేంద్రం ఇటీవల నిర్వహించిన 5జీ స్పెక్ట్రం వేలంలో వివిధ కంపెనీలు పాల్గొని అత్యధిక ధరల వద్ద ఫ్రీక్వెన్సీని కొనుగోలు చేశాయి. వేలంలో జియో అగ్రస్థానంలో ఉండగా, రూ. 43,084 కోట్లతో ఎయిర్ టెల్ రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల వాయిదా మొత్తం రూ. 8,312 కోట్లను ఎయిర్ టెల్ ముందే చెల్లించింది. మిగిలిన సంస్థలు ముందస్తు చెల్లింపులు మాత్రమే చేశాయి. ఈ క్రమంలో ఎయిర్ టెల్ చెల్లింపులు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 5జీ స్పెక్ట్రం కేటాయించినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం నుంచి లేఖ అందింది. దీనిపై ఆ సంస్థ చైర్మెన్ సునీల్ భారతి మిట్టల్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ బహుశా చెల్లింపులు జరిపిన రోజే ఇలా లేఖ అందడం చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. ఇంకా ‘గంటల వ్యవధిలోనే ఫ్రీక్వెన్సీ కేటాయించినట్టు లేఖ అందింది. దాంతో పాటు ‘ఈ’ బ్యాండ్ కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ డిపార్ట్‌మెంట్‌తో నాకున్న 30 ఏళ్ల అనుభవంలో మొట్టమొదటిసారి పని ఎలా జరగాలో అలా జరిగింది. ఎలాంటి గందరగోళం లేదు. ఆరా తీయడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరగడాలు లేవు. పై స్థాయితో పాటు టెలికాంలో ఉన్న నాయకత్వం కృషి ఇది. క్షేత్రస్థాయిలో సులభతర వాణిజ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఎంత మార్పు.. ఇలాంటి మార్పుతో దేశమే పరివర్తన చెందుతుంది. మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇదే ఇంధనంగా తోడ్పడుతుంది’ అని అభిప్రాయపడ్డారు.