ఎయిర్‌టెల్ షాక్.. ఏకంగా 57 శాతం పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌టెల్ షాక్.. ఏకంగా 57 శాతం పెంపు

November 21, 2022

గాలివాటం చూసి చార్జీలు పెంచేయడం టెలికం కంపెనీలకు మామూలే. తక్కువ ధరతో చక్కని ప్లాన్లతో ఊరించిన జియో తర్వాత ఎలా వాయించిందో అందరికీ తెలుసు. ఎయిర్‌టెల్ కూడా తక్కువేమీ తినలేదు. తాజాగా బేసిక్ ప్లాన్‌పై మోత మోగించింది. రూ. 99 ఉన్న 28 రోజుల బేస్ ప్లాన్ ధరను ఏకంగా 57 శాతం పెంచి రూ.155కు చేర్చింది. ప్రస్తుతం దీన్ని హరియాణా, ఒడిశా సర్కిళ్లలో అమలు చేస్తున్నా తర్వాత దేశమంతా వర్తింపజేసే అవకాశముంది. దీంతో కేవలం కాల్స్, మెసేజీల కోసం 99 ప్యాక్ వాడుతున్నవారు లబోదిబోమంటున్నారు.

రూ. 155 కొత్త బేసిక్ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్‌, 1 జీబీ డేటా, 300 ఎసెమ్మెస్‌లను వస్తాయి. ప్రస్తుతం దీనిపై ఫీడ్ బ్యాక్ తీసుకుని తర్వాత దేశమంతా అమలు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కంపెనీ వర్గాలు చెప్పాయి. కాగా 28 రోజుల వ్యాలిడిటీ, ఎసెమ్మెస్‌, నామమాత్రం డేటా ఉంటే అన్ని ప్లాన్లను రద్దు చేసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందరికీ రూ. 155 ప్లాన్ వర్తింపజేసి, తర్వాత స్పందనను బట్టి మరిన్ని మార్పులు చేస్తారని చెబుతున్నారు. ఎయిర్‌టెల్ రెండేళ్ల కిందట రూ.79 ఉన్న బేస్ ప్లాన్‌ను రద్దు చేసి రూ.99 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్నీ రద్దు చేయడంతో రూ. 155 ప్లాన్ కూడా ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. కంపెనీలో క్రమక్రమంగా అందరినుంచి రోజుకు రూ. 10 చొప్పున నెలకు రూ. 300 వసూలు చేయాలనే ధ్యేయంతో ఉన్నట్లు వాటి నిర్ణయాలను బట్టి అర్థమవుతోందన్నది నిపుణుల అంచనా.