Airtel to start 5G services rollout in August
mictv telugu

ఎయిర్‌టెల్ కస్టమర్లకు శుభవార్త.. అతి త్వరలో 5జీ సేవలు

August 3, 2022

మీరు ఎయిర్‌టెల్ కస్టమరా? అయితే మీకో శుభవార్త. 5జీ స్పెక్ట్రమ్ వేలం తర్వాత దిగ్గజ టెలికం కంపెనీలు స్పందించాయి. 5జీ సేవలకు సంబంధించి ఎయిర్‌టెల్ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టెలికాం గేర్ల తయారీ సంస్థలైన ఎరిక్సన్‌, నోకియా, శాంసంగ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు ఎరిక్సన్‌, నోకియాతో చాలా రోజుల నుంచి ఒప్పందం కొనసాగిస్తోంది. ఈ ఏడాది నుంచి శాంసంగ్‌తోనూ ఒప్పందం కొనసాగనుంది.

గత నెల జులై 26న ప్రారంభమైన 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో 900MHz, 1800MHz, 2100MHz, 3300MHz, 26 GHz బ్యాండ్స్‌లో 19,867.8 MHZ స్పెక్ట్రమ్‌ను రూ.43,084 కోట్లకు ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ గోపాల్‌ ప్రకటించారు. మరోవైపు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ కూడా భారతదేశంలో అతి త్వరలో 5జీ డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుడతామన్నారు. త్వరలోనే 5జీ సేవలు, 5జీ ప్లాట్‌ఫామ్స్, 5జీ ఆవిష్కరణలు అందిస్తానని చెప్పారు.