గత కొంతకాలంగా ఫామ్ లేక భారత్ టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయిన అజింక్య రహానె రంజీ ట్రోఫిలో సత్తా చాటాడు. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్ లో రహానె డబుల్ సెంచరీ సాధించాడు. 261 బంతుల్లో 204 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 26 ఫ్లోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ముంబాయి మొదటి ఇన్నింగ్స్‌లో 124 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 613 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 123, ఎస్.ములానీ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్( 195 బంతులతో 162) సెంచరీతో కదం తొక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 90 పరుగులతో రాణించి సెంచరీ ముందు ఔటయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో స్పిన్నర్ శశాంక్. కార్తికేయ రెండేసి వికెట్లు త్యాగరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు
భారత్ జట్టులోకి వస్తాడా ?
భారత్ జట్టులో స్థానం ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఆజింక్యా రహానె డబుల్ సెంచరీ బాది ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు. రహానె చివరిసారిగా జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 10 పరుగులు చేశాడు. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 1 పరుగులకే ఔట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేశాడు. తర్వాత అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. దేశావాలీ మ్యాచ్ ల్లో కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకపోవడంతో సెలెక్టర్లు అతని వైపు చూడలేదు. తాజాగా డబుల్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భాగంగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 9 నుంచి భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఇన్నింగ్స్‌తో జట్టులో స్థానం కోసం రహానె రేసులో నిలిచాడు.
ఐపీఎల్ వేలం సమయంలో..
ఈ ఏడాది అజింక్యా రహానెను కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా విడుదల చేసింది. గత ఐపీఎల్ మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మొత్తం చెల్లించి అతడిని తమ జట్టులోకి తీసుకున్నప్పటికీ జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు. అతను IPL 2022 యొక్క 7 మ్యాచ్‌లలో 133 పరుగులు మాత్రమే చేశాడు. ఈ కారణంగా, KKR అతనిని అతని జట్టు నుండి తొలగించింది. ఇప్పుడు ఐపీఎల్ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. 50 లక్షల బేస్ ప్రైస్‌తో రహానే ఈ వేలంలో అడుగుపెట్టాడు. అటువంటి పరిస్థితిలో, ఈ ఇన్నింగ్స్‌తో, అతను ఐపిఎల్ ఫ్రాంచైజీలు అతనిపై దృష్టిపెట్టే అవకాశం ఉంది.