నుపుర్ శర్మ తలను తెస్తే, ఆస్తి రాసిస్తానన్న అజ్మీర్ వాసి అరెస్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

నుపుర్ శర్మ తలను తెస్తే, ఆస్తి రాసిస్తానన్న అజ్మీర్ వాసి అరెస్ట్..

July 6, 2022

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ తలను తెచ్చేవారికి తన ఆస్తిని, ఇల్లును రాసిస్తానని ప్రకటించిన అజ్మీర్‌ దర్గా ఉద్యోగి ఖాదిమ్ సల్మాన్ చిస్తీని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 గంటల గడవకమునుపే పోలీసులు గతరాత్రి అతనిని పట్టుకున్నారు.

 

సోషల్ మీడియాలో చిస్తీ విడుదల చేసిన వీడియోలో.. ‘‘నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆమె (నుపుర్ శర్మ) ను బహిరంగంగా కాల్చి పారేస్తాను. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆమెను కాల్చి చంపడం ఖాయం. అంతేకాదు, ఆమె తలను తీసుకొచ్చిన వారికి నా ఇంటిని, ఆస్తులను రాసిస్తాను. ఇదే సల్మాన్ శపథం” అని ఆయన పేర్కొన్నాడు. దాంతో ఆ వీడియో దేశవ్యాప్తంగా తెగ వైరల్ అయింది. వెంటనే స్పందించిన పోలీసులు.. అజ్మీర్‌లోని అల్వార్ గేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, చిస్తీ కోసం గాలింపు మొదలుపెట్టారు.

అనంతరం ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ మాట్లాడుతూ..”చిస్తీపై కేసు నమోదు అయిందని తెలియడంతో అతడు పరారయ్యాడు. సల్మాన్ చిస్తీని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. చివరకు చిస్తీ పోలీసులకు దొరికాడు. ఖాదిం సల్మాన్ చిస్తీపై గతంలో కూడా కేసులు ఉన్నాయి. రౌడీషీట్‌తోపాటు 13 కేసులు ఉన్నాయి. హత్యతోపాటు, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్న సల్మాన్ ఇప్పుడు నుపూరు శర్మను బెదిరించాడు.” అని వివరాలను వెల్లడించారు.