ఆకర్ష-ఆకర్ష ఉఠో… గుప్తనిధుల లెమన్ బాబా.. నిమ్మకాయ పిండిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఆకర్ష-ఆకర్ష ఉఠో… గుప్తనిధుల లెమన్ బాబా.. నిమ్మకాయ పిండిన పోలీసులు

September 27, 2018

ఆకర్ష.. ఆకర్ష ఉఠో.. అని ఓ బాబా చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో ప్రత్యక్షమయ్యాడు. ఈయన ప్రత్యేకత ఏంటంటే.. ఆకర్ష.. ఆకర్ష.. ఉఠో(లే) అని మంత్రాలు జపించి నిమ్మకాయను గాల్లోకి లేపుతాడు. ఆకర్ష.. ఆకర్ష.. ఠైరో(నిలబడు)… అని నిమ్మకాయని ఆదేశిస్తాడు. బాబా ఆజ్ఞతో అది గాల్లో నిలబడుతుంది. ఎలాంటి ఆధారం లేకుండా నిమ్మకాయను అలాగే కాసేపు గాల్లోని నిలుపుతాడు. అక్కడున్న తన అనుచరుడు వచ్చి గాల్లో వున్న నిమ్మకాయ కిందా మీద ఎలాంటి ఆధారం లేదని చేతులు ఊపి చూపిస్తాడు. మళ్ళీ ఆకర్ష.. ఆకర్ష డౌన్(కూర్చో)… అని గాల్లో వున్న నిమ్మకాయను కిందికి దింపుతాడు. ఇంకే ఇదంతా చూసి బాబా వద్ద ఎన్నో మహిమలు వున్నాయని నమ్మే భక్తులకు కొదవే లేదు.Akarsha.. akarsha.. Utho ... Hidden funds Lemon Baba .. Lemon squeezed by policeమంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదోగానీ లెమన్ బాబా ముగ్గేసి, పసుపు కుంకుమలు పెట్టి, తిష్టవేసి కూర్చున్నాడంటే నిమ్మకాయలు గాల్లో తేలాల్సిందే. ఓం క్రీం హీం… అంటూ ఆ సాములోరి మహిమలకు జనాలు గొర్రెలు కాకమానలేదు. ఇదే అదునుగా భావించి క్షుద్రపూజలు చేసి గుప్తనిధుల అడ్రస్ చెప్తానని జనాలను నమ్మించి సొమ్ము చేసుకుంటున్నాడు లెమన్ బాబా. ఈ మాయగాడి ఇంద్రజాలాన్ని జనాలు నమ్మారు.

గప్త నిధుల కోసం జిల్లాలోని ఎర్రవారి పాలెం మండలం, నెరబైల వద్ద పొలాల్లో రాత్రిపూట క్షుద్రపూజలు చేస్తూ తవ్వకాలు ప్రారంభించారు. అటుపై ఊటబావులపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తవ్వకాలు జరపగా..

గ్రామ ప్రజలకు అనుమానం వచ్చి  మీడియాకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో లెమన్ బాబాగారి బండారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు లెమన్ బాబాను, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. బాబాకు సహకరించిన మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి బాబాల ఆటలు కట్టించాలని స్థానిక ప్రజలు పోలీసులను కోరారు. ఇలాంటివాళ్ళు ఇంకా చాలామంది గుప్త నిధుల కోసం రాత్రుళ్ళు అడవుల్లో తిరుగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ లెమన్ బాబా అవతారం ఎత్తిన వ్యక్తి తిరుపతికి చెందిన పట్టాభి రెడ్డిగా గుర్తించారు. క్షుద్రపూజల కోసం అతను వాడిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.