'Akasha Air' bookings started from 7th August
mictv telugu

ప్రారంభమైన ‘ఆకాశ ఎయిర్’ బుకింగ్స్.. ఆగస్టు 7నుంచి ప్రారంభం

July 22, 2022

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి విమాన సంస్థలు ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థల్లోకి రాకేశ్ ఝున్ ఝున్ వాలా విమాన సంస్థగా కొత్తగా వచ్చి చేరింది. తమ సంస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో ‘ఆకాశ ఎయిర్’ అనే పేరుతో సేవలను ప్రారంభించామని రాకేశ్ ఝున్ ఝున్ వాలా తెలిపారు. ‘ఆకాశ ఎయిర్’ ఆగస్టు 7 నుంచి దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

”మా సంస్థ తొలి విమానం ముంబై-అహ్మదాబాద్ మధ్య నడవనుంది. ఈ ప్రయాణానికి సంబంధించి, ఇప్పటికే టికెట్స్ బుకింగ్‌ను కూడా ప్రారంభించాం. ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య సేవలు ప్రారంభిస్తాం. దీనికి కూడా టికెట్లు ఇప్పటి నుంచే బుక్ చేసుకోవచ్చు. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో మా వాణిజ్య కార్యకలాపాలకు కంపెనీ శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఒక విమానం భారత్‌కు చేరుకుంది. మరొకటి ఈ నెలాఖరు వరకు కంపెనీ చేతికి అందనుంది. దశలవారీగా ఇతర నగరాలకు కూడా మా కార్యకలాపాలను విస్తరిస్తాం. తొలి ఏడాదిలో ప్రతి నెల రెండు విమానాల చొప్పున తమ ఫ్లీట్‌లో చేర్చుకుంటాం. మొత్తం 72 విమానాలకు బోయింగ్‌తో ఆకాశ ఎయిర్ ఒప్పందం కుదుర్చుకుంది” అని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రవీణ్ అయ్యర్ తెలిపారు.