‘తెలుగు హీరోలతో తన్నించుకోవాలని ఉంది’
చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలతో స్క్రీన్‌పై తన్నులు తినాలనుందని అంటున్నాడు ఓ మాజీ ఆర్మీ అధికారి. అదేంటీ.. మాజీ ఆర్మీ అధికారికి ఇలాంటి వింత కోరికేంటని అనుకోకండి. ఆయన ఇప్పుడు స్టైలిష్ విలన్. పేరు నితిన్ మెహతా. ఇంకా గుర్తుకు రాలేదా.. అదేనండి.. బాలయ్య బాబు అఖండ సినిమాలో మెయిన్ విలన్ ‘గజేంద్ర సాహు’.
21 ఏళ్లపాటు ఇండియన్ ఆర్మీకి సేవలందించిన ఆయన ప్రస్తుతం నటుడిగా రాణిస్తున్నాడు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత సినిమాల్లోకి ఎలా వచ్చాననే విషయం గురించి చెబుతూ… 'రిటైర్ అయ్యాక నేను గడ్డం పెంచి కొత్త లుక్ ట్రై చేశా. అదే లుక్‌తో ఓ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో ఓ ఫిలింమేకర్ కంటపడ్డాను. ఆ తర్వాత ఢిల్లీలో తొలిసారి మోడల్‌గా కనిపించాను. అనంతరం ఫ్యాషన్ వీక్స్‌లో పాల్గొనాలంటూ ఫోన్ వచ్చింది. అలా యాడ్స్‌లో, చివరికి సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ నేను సినిమాల్లోకి, మోడలింగ్‌లోకి రావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. అనుకోకుండా ఈదారిలో పడ్డాను. ప్రయాణం మాత్రం బాగుందని’ అన్నారు నితిన్ మెహతా. ప్రస్తుతం రావణాసుర, స్పై మూవీస్ చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఇతర దక్షిణాది భాషల్లోనూ నటించాలనుందని చెప్పారు. బాలకృష్ణగారితో పని చేయడం మర్చిపోలేని అనుభూతి అని చెప్పారు.