సూట్‌కేస్ పిల్లాడికి, సైకిల్ అమ్మాయికి చెరో లక్ష  - MicTv.in - Telugu News
mictv telugu

సూట్‌కేస్ పిల్లాడికి, సైకిల్ అమ్మాయికి చెరో లక్ష 

May 22, 2020

Akhilesh to give Rs 1 lakh each to ''suitcase'' mother, ''cycle'' daughter

లాక్‌డౌన్‌లో వలస కార్మికుల కష్టాలు కోకొల్లలు. మండే ఎండల్లో కాలి నడకన వెళ్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు గుండెలను కదిలిస్తున్నాయి. ఓ తల్లి తన స్వస్థలానికి వెళ్లేందుకు తన బిడ్డను సూట్‌కేస్‌పై పడుకోబెట్టుకుని కాలినడకన వెళ్లగా.. ఆ ఘటన తాలూకు ఫోటోలను చూసి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కరిగిపోయారు. ఆ తల్లి కష్టానికి రూ.లక్ష సాయం అందించేందుకు ముందుకొచ్చారు. బిడ్డ సూట్‌కేస్‌పై నిద్రపోతుండగా ఆగ్రాలో ఆమె కాలినడకన దాన్ని లాక్కెళ్తున్న ఫోటోలో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. 

పంజాబ్‌కు వస్తున్న సదరు మహిళ తన స్వస్థలమైన ఝాన్సీకి నడిచి వెళ్తుండగా ఎవరో ఈ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా  నెటిజన్లు చూసి చలించిపోయారు. పెద్ద ఎత్తున స్పందించారు. ఝాన్సీలోని తమ పార్టీ నేతలు ఆమె చిరునామా కనుక్కుని సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ నేతలు తెలిపారు. ఇదిలావుండగా, అస్వస్థతతో బాధపడుతున్న తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని స్వస్థలానికి తీసుకెళ్లిన 15 ఏళ్ల జ్యోతి అనే బాలికకు కూడా అఖిలేశ్ లక్ష రూపాయల సాయం ప్రకటించారు. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్‌లోని దార్భంగా వరకు ఆమె సైకిల్ మీదనే తండ్రిని తీసుకుని వెళ్లింది. వారం రోజుల పాటు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కి స్వస్థలానికి చేరుకున్న విషయం తెలిసిందే.