జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ తనలో ఉన్న మరో టాలెంటును బయటపెట్టాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటను పియానోపై వాయించి తన ప్రతిభను చాటుకున్నాడు. అకీరా ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా, సోమవారం జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తన మాజీ భార్య రేణూ దేశాయ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకీరా తన సంగీత ప్రతిభను ప్రదర్శించాడు.
ఈ వీడియో రిలీజ్ అవడంతో పవన్ అభిమానులతో పాటు మెగా అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. కాగా, అకీరా నందన్ సంగీతంలోనే కాకుండా తండ్రి పవన్ కల్యాణ్ లాగా మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, కర్రసాముు కూడా నేర్చుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు గతంలో రిలీజ్ అయ్యాయి. తాజాగా పియానో వీడియో రావడంతో తండ్రికి తగ్గ తనయుడని పలువురు ప్రశంసిస్తున్నారు. అకీరా ఇన్ని విద్యలు నేర్చుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని చాలా మంది సినీ అభిమానులు భావిస్తున్నారు. కానీ, అకీరా తల్లి రేణూ దేశాయ్ మాత్రం అకీరా సినిమాల్లోకి రాడని ఓ సందర్భంలో చెప్పింది. మరి ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూడాల్సి ఉంది.